శ్రీవారి ఆలయ భక్తులకు తితిదే పాలక మండలి ఉగాది బంపర్ ఆఫర్ ఇచ్చింది. తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని ప్రతి ఒక్క ఉద్యోగికి పది లడ్డూలు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. దీనికి కారణం లేకపోలేదు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో శ్రీవారి దర్శనం బంద్ చేశారు. కేవలం అర్జిత సేవలు మాత్రమే నిర్వహిస్తున్నారు. కొండపైకి రాకపోకలను నిలిపివేశారు.
దీంతో ఇప్పటికే తయారు చేసిన 2 లక్షలకు పైగా లడ్డూలు మిగిలిపోయాయి. ఈ లడ్డూలు పాడైపోయే అవకాశం ఉన్నందున టీటీడీ ఉద్యోగులకు ఉగాది కానుకగా ఈ లడ్డూలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. టీటీడీలో పని చేసే ఒక్కో ఉద్యోగికి ఉచితంగా 10 లడ్డూలను పంపిణీ చేస్తున్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు కూడా లడ్డూ ప్రసాదం పంపిణీ చేస్తున్నారు టీటీడీ అధికారులు.
ఈ నెల 19వ తేదీ సాయంత్రం నుంచి తిరుమలకు భక్తులను అనుమతించడం లేదు. కొండ పైనున్న భక్తుల దర్శనం ముగిసిన తర్వాత అందరిని కిందకు పంపించారు. 19వ తేదీ రోజే కింద నుంచి పైకి వాహనాలను అనుమతించలేదు. కేవలం భక్తులకు దర్శనాలు మాత్రమే నిలిపివేస్తున్నామని, ఆలయం తెరిచి ఉంటుందని అర్చకులు స్పష్టం చేశారు.
తిరుమల కొండపైకి భక్తులను, వాహనాలను అనుమతించకపోవడంతో నిర్మానుష్యంగా మారింది. రోజుకు లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడే కొండ.. ఇపుడు పూర్తిగా బోసిపోయి కనిపిస్తోంది. గోవిందా గోవిందా నామస్మరణలతో మార్మోగే ఏడు కొండల్లో ఇపుడు నిశ్శబ్ద వాతావరణం నెలకొనివుంది. కేవలం అర్చకులు, ఉద్యోగులు మాత్రమే కొండపై ఉన్నారు. శ్రీవారి సేవలో అర్చకులు మాత్రమే పాల్గొంటున్నారు.