భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన అత్యంత విలువైన ప్రాజెక్టుల్లో మంగళ్‌యాన్ ఒకటి. ప్రస్తుతం ఇది విజయవంతంగా సేవలు అందిస్తోంది. అయితే, అంతరిక్షనౌక కక్ష్యను మార్చాల్సి వచ్చింది. దీనికి కారణం ఎంటో తెలుసా? మంగళ్‌యాన్ సుదీర్ఘకాలం గ్రహణం పాలు(చీకటి)కాకుండా ఉండేందుకుగాను అంతరిక్షనౌక కక్ష్యను మార్చినట్టు ఇస్రో ఛైర్మన్ ఏఎస్.కిరణ్ కుమార్ తెలిపారు.
ఈనెల 17వ తేదీ సాయంత్రం కంట్రోల్ సెంటర్ నుంచి రిమోట్ సాయంతో కక్ష్యను స్వల్పంగా మార్చి గ్రహణ సమయాన్ని తగ్గించినట్టు ఆయన వెల్లడించారు. మంగళ్‌యాన్ ప్రస్తుతమున్న కక్ష్యంలో ఎక్కువ కాలం ఉండటం వల్ల దానిపై గ్రహణం నీడ పడుతుంది. ఇలా జరగడం వల్ల నౌకకు సూర్యకాంతి లభించక విద్యుత్ కొరత ఏర్పడే ప్రమాదం ఉండిందని ఆయన వివరించారు.
కక్ష్యను విజయవంతంగా మార్చడం వల్ల ఇప్పుడా సమస్య తప్పిందని చెప్పారు. ప్రస్తుతం గ్రహణ ప్రభావం మంగళ్‌యాన్‌పై ఏమాత్రం కనిపించడం లేదన్నారు. తాము చేసిన ప్రయోగం విజయవంతమైంది. అంతరిక్ష నౌకలో ప్రస్తుతం 30 కిలోల ఇంధనం మిగిలి ఉంది. కక్ష్య మార్పుతో మరింత ఎక్కువ కాలం అంతరిక్షనౌక ఉపయోగంలో ఉంటుంది అని కిరణ్ కుమార్ వివరించారు.