సంచలన నిర్ణయం తీసుకున్న ఇస్రో.. ఏంటది?

సోమవారం, 17 ఆగస్టు 2020 (12:08 IST)
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. గత వారం రోజులుగా రోజుకు 60 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో భారత అంతరిక్ష పరిశోధనా ఇస్రో సంచలన నిర్ణయ తీసుకుంది. ఇస్రోలో పని చేసే 20 మంది ఉద్యోగులకు ఈ వైరస్ సోకింది. దీంతో ఈ యేడాది జరగాల్సిన రోజువారీ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని, ఈ సంవత్సరం షెడ్యూల్ చేసిన 12 ప్రయోగాలను రద్దు చేసి, వాటి స్థానంలో ఒకే ప్రయోగం జరుపుతామని పేర్కొంది.
 
ఈ మేరకు షార్ నియంత్రణాధికారి వి. కుంభకర్ణన్ తాజా మార్గదర్శకాలను జారీ చేశారు. ఈయన విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్న మార్గదర్శకాల మేరకు.. షార్ సహా, సమీపంలోని పట్టణమైన సూళ్లూరుపేటలో కొవిడ్-19 కేసుల సంఖ్య పెరగడం, వారి చుట్టుపక్కలే శ్రీహరికోట ఉద్యోగులు ఉండటం, వారు కూడా మహమ్మారి బారిన పడుతుండటంతోనే రోజువారీ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు పేర్కొన్నారు. 
 
షార్ కేంద్రంలో వైరస్ ప్రబలకుండా, రెండు రోజుల పాటు కార్యాలయం ప్రాంగణమంతా ఫ్యుమిగేషన్, శానిటైజేషన్ చేయించాలని నిర్ణయించామని, ఇందుకు కొంతసమయం పడుతుంది కాబట్టి, ఉద్యోగుల భద్రత నిమిత్తం అన్ని కార్యకలాపాలనూ నిలిపివేసినట్టు తెలిపారు. 
 
కాగా, లాక్డౌన్ అమలులోకి వచ్చిన తర్వాత తొలి దశలో 30 శాతం మందితో, ఆపై 50 శాతం మందితో శ్రీహరికోట కార్యకలాపాలు జరిగాయి. ఇకపై రాకెట్ లాంచ్ స్టేషనులో అత్యవసర పనుల నిమిత్తం అతి కొద్ది మందిని మాత్రమే అనుమతిస్తామని, మిగతా వారిలో ఇంటి నుంచి పనిచేసే అవకాశమున్న ప్రతి ఒక్కరికీ అనుమతిస్తామని స్పష్టంచేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు