కొత్త సంవత్సరం 2024 తొలి రోజే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సరికొత్త ప్రయోగానికి సిద్ధమైంది. జనవరి ఒకటో తేదీ సోమవారం ఉదయం 9.10 గంటలకు పీఎస్ఎల్వీ సీ58 ప్రయోగాన్ని చేపట్టనుంది. ఈ ప్రయోగంలో ఎక్స్‌పోశాట్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టనుంది. ఆదివారం ఉదయం 8.30 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభంకాగా, సోమవారం ఉదయం 9.10 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగం శ్రీహరికోటలోని షార్ సెంటర్ నుంచి చేపట్టనున్నారు. ఇందుకోసం శనివారం ప్రయోగ సన్నద్ధతతో లాంచ్ ఆథరైజేషన్ సమావేశాలు కూడా నిర్వహించారు.
ఆదివారం ఉదయం 8.10 గంటలకు ప్రారంభమయ్యే కౌంట్ డౌన్ సోమవారం ఉదయం రాకెట్ ప్రయోగంతో ముగుస్తుంది. మునుపటి పరిశోధనలకు భిన్నంగా ఈమారు ఎక్స్-రేతో ఖగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ విశ్వరహస్యాలను ఛేదించడం ఈ మిషన్ లక్ష్యం. ఎక్స్‌పోశాట్ జీవితకాలం ఐదేళ్లు. ఈ మారు ఎక్స్‌పోశాట్ ఉపగ్రహంతో పాటు మరో పది ఇతర పేలోడ్‌లు అంతరిక్షంలో ప్రవేశపెట్టనున్నారు.