పూరీలోని జగన్నాథ ఆలయాన్ని 12వ శతాబ్దంలో నిర్మించారు. ఆలయంలోని రత్న భాండాగారంలో జగన్నాథ స్వామి, సుభద్ర, భలభద్రలకు చెందిన విలువైన ఆభరణాలను భద్రపరిచారు. ఈ భాండాగారాన్ని తెరిచే ముందు కీలకమైన క్రతువు 'ఆజ్ఞ'ను నిర్వహించారు.
కాగా, ఈ రహస్య గదిని తెరిచే సందర్భంగా పాములు పట్టే బృందాలను కూడా మోహరించారు. నాలుగున్నర దశాబ్దాలుగా గదిని మూసి ఉంచడంతో, లోపల విషసర్పాలు ఉంటాయన్న ఉద్దేశంతో పాములు పట్టే నిపుణులను సిద్ధంగా ఉంచారు.
కాగా, రత్న భాండాగారంలో నిధిని తరలించేందుకు పెద్ద చెక్క పెట్టెలను ప్రభుత్వం సిద్ధం చేసింది. వాటిని ప్రత్యేక వాహనంలో పూరీ ఆలయం వద్దకు చేర్చారు. శతాబ్దాల కిందట నిర్మితమైన ఈ ఆలయానికి ఎందరో రాజులు విలువైన ఆభరణాలు, మణులు, మాణిక్యాలను కానుకలుగా అందజేశారు. ఈ సంపదను ఆలయంలోని మూడు గదుల్లో భద్రపరిచారు.
పూరీ జగన్నాథుడి గర్భాలయం వెనుక శయన మందిరం.. దీనికి ఎడమవైపు రత్నభాండాగారం ఉంటాయి. ఇందులో మూడు గదులు ఉండగా... తొలి గదిలో స్వామివారి నిత్యసేవలకు అవసరమైన ఆభరణాలు.. పండగలు, ఉత్సవాల్లో ముగ్గురు మూర్తులు తొడిగే అలంకారాలున్నాయి. మూడో గదిలో మాత్రం వెలకట్టలేని సంపదను కర్రపెట్టెల్లో ఉంచి భద్రపరిచారు.