జయలలితకు కారాగారవాసం : కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం!

మంగళవారం, 30 సెప్టెంబరు 2014 (14:31 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు అక్రమాస్తుల కేసులో జైలుశిక్ష పడటంతో జీర్ణించుకోలేని ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చెన్నైలోని తమిళనాడు డీజీపీ ప్రధాన కార్యాలయం ముందు ఆ రాష్ట్ర పోలీసు విభాగానికి చెందిన వేల్ మురుగన్ అనే కానిస్టేబుల్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే తక్షణమే అప్రమత్తమైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని మైలాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 
 
తేని సమీపంలోని ఒడైపట్టై పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న వేల్ మురుగన్, మంగళవారం ఉదయం కిరోసిన్ డబ్బా చేతబట్టి నేరుగా డీజీపీ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయం ముందు ఒక్కసారిగా ఒంటిపై కిరోసిన్ పోసుకున్న వేల్ మురుగన్ "అమ్మా" అంటూ జయలలిత పేరును బిగ్గరగా పలుకుతూ ఒంటికి నిప్పంటించుకునేందుకు యత్నించాడు. 
 
దీంతో అప్రమత్తమైన పోలీసులు అతడి ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్నారు. ఈ సంఘటన పోలీసు వర్గాల్లోనే కాకుండా, నగరంలో కలకలం సృష్టించింది. కాగా, జయలలితకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు రావడాన్ని జీర్ణించుకోలేక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి 17 మంది మృత్యువాత పడ్డారు. 

వెబ్దునియా పై చదవండి