తమిళనాడు ఎన్నికల్లో స్పష్టంగా కనిపించిన 'అమ్మ' ఇడ్లీ సాంబార్ ప్రభావం

గురువారం, 19 మే 2016 (10:40 IST)
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ముఖ్యమంత్రి జయలలిత పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన అమ్మ క్యాంటీన్ల ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఈ సంక్షేమ పథకాల పుణ్యమానే జయలలిత వరుసగా రెండోసారి అధికారాన్ని చేపట్టనున్నారు. నిజానికి తమిళనాడు ఓటర్లు ఒకసారి అధికారంలో ఉన్న పార్టీకి మరోసారి అధికారం ఇచ్చే సంస్కృతి లేదు. కానీ, ఈ దఫా మాత్రం ఓటర్లు గత చరిత్రకు భిన్నంగా తీర్పునిచ్చారు. 
 
తమిళనాడులో ఎన్నికలు జరిగిన 232 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఫలితాల సరళి వెల్లడవుతుండగా, జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే 134 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అలాగే, డీఎంకే 93, ఇతరులు ఐదు చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుత ట్రెండ్ మేరకు తుది ఫలితాలు వెలువడితే జయలలిత వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినట్టే. 
 
అయితే, గత సోమవారం జరిగిన పోలింగ్ తర్వాత వెల్లడైన ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నీ డీఎంకేకు అనుకూలంగా ఉన్నాయి. ఒక్క సీ ఓటర్ సంస్థ నిర్వహించిన సర్వే మాత్రమే జయలలిత తిరిగి అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. మిగిలిన న్యూస్ ఏజెన్సీలు ఏవీ కూడా తమిళ ఓటరు నాడిని పసిగట్టలేక పోయాయి. 
 
దీనికి అనేక కారణాలు లేకపోలేదు. తమిళనాడులో జయలలిత పేదల కోసం ప్రారంభించిన పలు పథకాలు చూపిన ప్రభావాన్ని అంచనా వేయడంలో ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన కంపెనీలు విఫలమైనాయని చెప్పుకోవచ్చు. నిత్యమూ అమ్మ క్యాంటీన్లలో రూ.3 చెల్లించి సాంబార్ రైస్, రూ.1 చెల్లించి ఇడ్లీలు తింటున్న రిక్షా కార్మికుల నుంచి ఐటీ ఉద్యోగుల వరకూ వేసిన ఓట్లు ఈ ఎన్నికల్లో జయలలితకు ఎంతో ప్లస్ అయ్యాయి. ఎన్నికల ఫలితాలను ఆమెకు అనుకూలం చేశాయి. నిత్యమూ వేలాది మంది అమ్మ క్యాంటీన్లలోని భోజనంతో కడుపు నింపుకుంటుండగా, వీరంతా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేశారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు.
 
సాంబార్ రైస్, ఇడ్లీలు మాత్రమే కాదు, రూ.5కే పాలక్ రైస్, కర్డ్ రైస్ వంటి ఆహార పదార్థాలను సైతం అమ్మ క్యాంటీన్లు అందిస్తుండటంతో పేదల కడుపు నిత్యమూ నిండుతోంది. జయలలిత అందిస్తున్న చౌక అహారం తిన్నవారు తమ అన్నదాతను ఓటేసి ఆశీర్వదించినట్టు ఈ ఫలితాల సరళి చెబుతోంది. ఇదే విషయాన్ని సరిగ్గా అంచనా వేయని ఎగ్జిట్ పోల్ సంస్థలు, ప్రభుత్వంపై వచ్చే సగటు వ్యతిరేకత, ఇటీవలి వరదలు వంటి వాటిని మాత్రమే దృష్టిలో పెట్టుకుని అంచనాలు విడుదల చేసి పప్పులో కాలేశాయని చెప్పొచ్చు. 

వెబ్దునియా పై చదవండి