శశికళపై హత్యా నేరం కేసును నమోదు చేయాలి : ట్రాఫిక్ రామస్వామి

గురువారం, 9 ఫిబ్రవరి 2017 (09:54 IST)
దివంగత తమిళనాడు సీఎం జయలలితను హత్య చేశారనే ఆరోపణపై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళతో పాటు ఇతర నేతలపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని ప్రముఖ సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి కోరారు. ఈ మేరకు చెన్నై నగర పోలీసు కమిషనర్‌ను ఆదేశించాలంటూ ఆయన మద్రాస్ హైకోర్టులో ఓ పిటీషన్ దాఖలు చేశారు. అలాగే, తనతో బలవంతంగా సీఎం పదవికి రాజీనామా చేయించినట్టు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చేసిన వ్యాఖ్యల ఆధారంగా కేసు పెట్టాలని కూడా ఆయన తేనాంపేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
 
మరోవైపు... కోయంబత్తూరులోని అన్నాడీఎంకే కార్యాలయం వద్ద, వావుసి మైదానం వద్ద మంగళవారం అర్థరాత్రి నుంచి పోలీసులు భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. చెన్నైలో ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం పార్టీ అధిష్టానంపై ఆరోపణలు చేయడంతో ముందు జాగ్రత్త చర్యగా కోయంబత్తూరులోని అన్నాడీఎంకే కార్యాలయం చుట్టూ సాయుధ పోలీసులతో కాపలా ఏర్పాటు చేశారు. జల్లికట్టు ఉద్యమం జరిగిన వావుసి మైదానాన్ని కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తెచ్చుకుని భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. జల్లికట్టు ఉద్యమంలాంటి సంఘటనలు వావుసి మైదానంలో మళ్లీ జరుగకూడదనే భావంతో పోలీసు బలగాలను మొహరించారు.

వెబ్దునియా పై చదవండి