అమ్మ వారసురాలిని నేనే.. మాటలు, వేషధారణతో ఆకట్టుకున్న దీప.. ఫిబ్రవరి 24 నుంచి?

మంగళవారం, 17 జనవరి 2017 (15:38 IST)
దివంగత ముఖ్యమంత్రి మేనకోడలు దీపా జయకుమార్.. రాజకీయాల్లోకి అడుగుపెట్టేశారు. దివంగత సీఎం ఎంజీఆర్ శత జయంతి సందర్భంగా.. తానే అమ్మకు అసలైన వారసురాలినని దీప స్పష్టం చేశారు. త్వరలో ఆమె పార్టీ పేరు ప్రకటిస్తానని తెలిపారు. జయలలిత పుట్టిన రోజు ఫిబ్రవరి 24 నుంచి పార్టీ కార్యాచరణ ప్రారంభమవుతుందని తెలిపారు. ఎంజీఆర్, జయలలిత అడుగుజాడల్లో తాను ముందుకు దూసుకెళ్తానని తెలిపారు.
 
అమ్మ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తానని దీప స్పష్టం చేశారు. తమిళ ప్రజల సేవకే తన జీవితం అంకితమని తెలిపారు. అన్నాడీఎంకే కార్యకర్తలంతా తనతోనే ఉన్నారని తెలిపారు. అన్నాడీఎంకేలో చాలా మంది తన నాయకత్వాన్ని కోరుకుంటున్నారని వెల్లడించారు. 
 
జయలలిత మృతిపై తనకెలాంటి అనుమానాలు లేవని.. తన సోదరుడు దీపక్‌ ఆమెతో పాటు ఆస్పత్రిలోనే ఉన్నారని తెలిపారు. కాగా, దీపా జయకుమార్ వెంట భారీగా ప్రజలు, కార్యకర్తలు రావడం గమనార్హం. ఆమె కూడా మాటలు, వేషాధారణలో జయలలితను అనుసరించడం అక్కడున్న వారిని ఆకట్టుకుంది.
 
చెన్నైలో మంగళవారం మీడియాతో మాట్లాడిన దీప... తాను రాజకీయాల్లోకి రావాలని అన్నాడీఎంకే కార్యకర్తలు కోరుకుంటున్నారని.. వారు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో తమిళ ప్రజలకు సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. దివంగత జయలలిత కలలను సాకారం చేసేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తానన్నారు.

వెబ్దునియా పై చదవండి