సీఎం యోగికి షాకిచ్చిన కేంద్రం : ఆ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలంటూ ఆదేశాలు..

వరుణ్

ఆదివారం, 21 జులై 2024 (16:22 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు కేంద్రం తేరుకోలేని షాకిచ్చింది. కన్వర్‌ యాత్ర మార్గంలో ఉన్న హోటళ్లు, ధాబాలు, తోపుడుబండ్లపై వాటి యజమానుల పేర్లు, వివరాలు ప్రదర్శించాలంటూ ఇచ్చిన ఉత్తర్వులపై విపక్షాలతో పాటు ఎన్డీయే భాగస్వామ్య పక్షాలూ మండిపడుతున్నాయి. ఎల్జేపీ, జేడీయూ వంటి పార్టీలు ఇప్పటికే ఈ ఉత్తర్వుల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి. 
 
తాజాగా ఈ జాబితాలో రాష్ట్రీయ లోక్‌దళ్‌ (ఆర్‌ఎల్‌డీ) చేరింది. ఉత్తరప్రదేశ్‌ సర్కార్‌ ఈ ఉత్తర్వుల్ని ఉపసంహరించుకోవాలని ఆర్‌ఎల్‌డీ చీఫ్‌, కేంద్రమంత్రి జయంత్‌ చౌధరి డిమాండ్‌ చేశారు. కన్వర్‌ యాత్ర ఏ ఒక్క మతానికో, కులానికో చెందినది కాదన్నారు. ఈ ఉత్తర్వుల్ని పెద్దగా ఆలోచించకుండా ఇచ్చినట్లు కనబడుతోందని.. ఇప్పటికే ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకున్నందున మొండిపట్టుతో వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోందని వ్యాఖ్యానించారు. దీన్ని ఉపసంహరించుకోవాలంటే ఇంకా సమయం ఉందని.. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందేనన్నారు. 
 
ప్రతిపక్షాలతోపాటు ఎన్డీయే భాగస్వామ్య పార్టీలైన లోక్‌ జనశక్తి, జనతాదళ్‌ (యునైటెడ్‌) కూడా ఈ ఉత్తర్వులను ఖండించడం గమనార్హం. కులం, మతం ఆధారంగా ప్రజలను వేరుచేసే నిర్ణయాలను తాము సమర్థించేది లేదని లోక్‌ జనశక్తి చీఫ్, కేంద్ర మంత్రి చిరాగ్‌ పాసవాన్‌ స్పష్టం చేశారు. ఎన్డీయేలోని మరో భాగస్వామి అయిన జేడీయూ నేత కె.సి.త్యాగి సైతం మత వైషమ్యాలను పెంచే ఈ నిర్ణయాన్ని సత్వరం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. 
 
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత హరీశ్‌ రావత్‌ మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలు వర్గ వైషమ్యాలను పెంచే నిర్ణయాలు తీసుకోవడం దురదృష్టకరం, బాధాకరమన్నారు. ఇది ‘మతోన్మాదం’ కంటే తక్కువేమీ కాదని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి పవన్‌ ఖేడా ధ్వజమెత్తారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్, బహుజన్‌ సమాజ్‌ పార్టీ అధినేత్రి మాయావతి సైతం ఈ ఉత్తర్వులను తీవ్రంగా ఖండించారు. ఇటువంటి ఆంక్షలను జారీ చేసిన అధికారులపై కఠినచర్యలు తీసుకోవాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ డిమాండ్‌ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు