దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఈ వైరస్ బారి నుంచి ప్రజాప్రతినిధులు సైతం తప్పించుకోలేకపోతున్నారు. దీంతో రోజురోజుకూ ఈ వైరస్ బారినపడుతున్న రాజకీయ నేతల సంఖ్య పెరిగిపోతోంది. ఇటీవలే కేంద్ర మంత్రి అమిత్ షా ఈ వైరస్ బారినపడి కోలుకున్న విషయం తెల్సిందే. తాజాగా జార్ఖండ్ ఆరోగ్యశాఖ మంత్రి బన్న గుప్తా, తమిళనాడు రవాణా శాఖామంత్రి విజయభాస్కర్‌లు ఈ వైరస్ బారినపడ్డారు.
జార్ఖండ్ రాష్ట్ర ఆరోగ్య మంత్రికి కరోనా పాజటివ్ అని మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ట్విటర్‌లో ప్రకటించారు. గత వారం రోజుల్లో తనను కలిసినవారు పరీక్షలు చేయించుకోవాలని కోరారు. తాను కరోనా పరీక్ష చేయించుకున్నానని, అందులో పాజిటివ్ వచ్చిందని తెలిపారు.
అలాగే, తమిళనాడు రవాణాశాఖ మంత్రి విజయభాస్కర్ మంగళవారం కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు దవాఖానలో చేరి, చికిత్స తీసుకుంటున్నారు. తమిళనాడు వ్యాప్తంగా మంగళవారం 5,709 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా, మొత్తం 3,49,654కు చేరాయి. బాలిక సహా మరో 121 మంది తాజాగా మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 6,007కు చేరింది.