జూలై నెలలో కేంద్ర బడ్జెట్ : ఈ నెల 22న జీఎస్టీ కౌన్సిల్ మీట్!!

వరుణ్

శుక్రవారం, 14 జూన్ 2024 (08:57 IST)
కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను బడ్జెట్‌ను జూలై మూడో వారంలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే, జీఎస్టీ కౌన్సిల్ మీట్ ఈ నెల 22వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరుగనుంది. అలాగే, లోక్‌సభ కొత్త స్పీకర్ ఎన్నిక ఈ నెల 26వ తేదీన జరుగనుంది. 18వ లోక్‌సభ ఈ నెల 24వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఇవి జూలై మూడో తేదీ వరకు జరిగే అవకాశం ఉందని కేంద్ర వర్గాలు పేర్కొన్నాయి. 
 
ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి విజయం సాధించడంతో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే, ఆర్థిక మంత్రి శాఖ బాధ్యతలను మరోమారు నిర్మలా సీతారామన్‌ దక్కించుకున్నారు. ఆమె గురువారం బాధ్యతలను స్వీకరించారు. ఆ తర్వాత ఆర్థిక శాఖ సీనియర్ అధికారులతో ఆమె సమావేశమై, 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను పూర్తి స్థాయి బడ్జెట్‌ను రూపొందించాలని కోరారు. 
 
ఖచ్చితమైన ప్రణాళిక, సమగ్ర విశ్లేషణతో బడ్జెట్‌ను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. దేశ ఆర్థిక ప్రాధాన్యాలు, నిర్దేశించుకున్న లక్ష్యాలు, సవాళ్లకు అనుగుణంగా బడ్జెట్‌ ఉండాలని సూచించారు. దీంతో కేంద్ర బడ్జెట్‌ జూలై మూడో వారంలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మరోపక్క, 53వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం న్యూఢిల్లీ వేదికగా జూన్‌ 22న జరగనుంది. ఈ మేరకు జీఎస్టీ కౌన్సిల్‌ ఎక్స్‌లో గురువారం ఓ పోస్టు పెట్టింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ఇతర ప్రతినిధులు పాల్గొంటారని తెలిపింది. 52వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం గతేడాది అక్టోబరులో జరిగింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు