నంబర్ వన్ - నంబర్ టూ అనుమతిస్తే కమల్నాథ్ సర్కారు మటాష్ : బీజేపీ ఎమ్మెల్యే

బుధవారం, 24 జులై 2019 (20:21 IST)
తమ పార్టీకి చెందిన నంబర్ వన్, నంబర్ టూ అనుమతిస్తే మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని 24 గంటల్లో కూల్చివేస్తామని బీజేపీ ఎమ్మెల్యే ఒకరు వార్నింగ్ ఇచ్చారు. వారిద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని బీజేపీ ఎమ్మెల్యే గోపాల్ భార్గవ హెచ్చరించారు. 
 
కర్నాటక రాష్ట్రంలో కాంగ్రెస్ - జేడీఎస్ సర్కారును కమలనాథులు కూల్చివేసిన విషయం తెల్సిందే. దీంతో బొటాబొటీ మెజార్టీతో ఉన్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ సర్కారును కూల్చివేయాలని స్థానిక కమలనాథులు భావిస్తున్నారు. 
 
దీనిపై బీజేపీ ఎమ్మెల్యే ఒకరు స్పందిస్తూ, బీజేపీలోని నంబర్‌ 1, నంబర్‌ 2 గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే.. కమల్‌నాథ్‌ ప్రభుత్వం 24 గంటల్లో పడిపోవడం ఖాయమన్నారు. ఈ ఏడు నెలలే కమల్‌నాథ్‌ ప్రభుత్వాన్ని నడపడం ఎక్కువైపోయిందన్నారు. 
 
అయితే, గోపాల్ భార్గవ్ వ్యాఖ్యలపై సీఎం కమల్నాథ్ గట్టినా స్పందించారు. తమ ప్రభుత్వం కూలదోయడానికి అంత సులభం కాదన్నారు. పైగా బీజేపీ నంబర్ వన్, నంబర్ టూ ఎవరో చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేశారు. 
 
పైగా, తమ పార్టీకి చెందిన ఎమ్మెలు అమ్ముడుపోరన్నారు. బీజేపీ బలపరీక్షకు సిద్ధమైతే తాము కూడా సిద్ధమని సవాల్ విసిరారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదన్నారు. 
 
కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో 231 అసెంబ్లీ స్థానాలున్న మధ్యప్రదేశ్‌లో 114 స్థానాలను కాంగ్రెస్‌ గెలుచుకుంది. బీజేపీ 109 స్థానాల్లో గెలుపొందింది. అయితే బీఎస్పీ, స్వతంత్ర ఎమ్మెల్యేలతో కలిసి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు సాధారణ మెజార్టీ 115. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు