కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కమల్ నాథ్ ఎంపికైనట్టు వార్తలు వస్తున్నాయి. పార్టీ అధినేతగా మాత్రం సోనియా గాంధీ కొనసాగుతారు. అందువల్లే కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ గురువారం అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య సమావేశం అర్థగంట పాటు సాగింది.
ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు మరికొన్ని కీలకమైన అంశాలను కూడా ఈ సమావేశంలో చర్చించారు. కమల్‌నాథ్‌ను కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించనున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.
నిజానికి కమల్‌నాథ్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించాలన్న నిర్ణయాన్ని కొన్ని రోజుల క్రితమే తీసుకున్నట్టు సమాచారం. జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలన్నిటినీ కాంగ్రెసే సమన్వయ పరచాలన్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సూచించడంతో.. ఇందుకు మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్ సమర్థుడని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది.