సిగ్నల్ జంప్ చేసి ఎక్స్‌ప్రెస్ రైలను ఢీకొన్న గూడ్సు రైలు.. 15కి పెరిగిన మృతులు

వరుణ్

సోమవారం, 17 జూన్ 2024 (12:46 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో సోమవారం రెండు రైళ్లు ఢీకొన్ని సంఘటనలో చనిపోయిన వారి సంఖ్య 15కి పెరిగింది. డార్జిలింగ్‌ జిల్లాలో ఒకే ట్రాక్‌ పైకి వచ్చిన రెండు రైళ్లు ఢీకొనడంతో ఓ బోగీ గాల్లోకి లేచింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 15 మంది ప్రయాణికులు మృతిచెందగా.. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. అస్సాంలోని సిల్చార్‌ నుంచి కోల్‌కతాలోని సీల్దాకు బయల్దేరిన కాంచన్‌జంఘా ఎక్స్‌ప్రెస్‌ మధ్యలో న్యూజల్‌పాయ్‌గుడి వద్ద ఆగింది. అక్కడి నుంచి బయల్దేరిన కాసేపటికే రంగపాని స్టేషన్‌ సమీపంలో వెనక నుంచి ఓ గూడ్స్‌ రైలు దీన్ని బలంగా ఢీకొట్టింది.
 
ప్రమాద తీవ్రతకు గూడ్స్‌ రైలు బోగీలు చెల్లాచెదురుగా పడిపోగా.. ఎక్స్‌ప్రైస్‌ రైలు రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ఓ బోగీ గాల్లోకి లేవడం ప్రమాద తీవ్రతకు అద్దంపడుతోంది. సమాచారమందుకున్న రైల్వే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై దార్జిలింగ్‌ అదనపు ఎస్పీ మాట్లాడారు. పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
 
సిగ్నల్‌ జంప్‌ కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. రెడ్‌ సిగ్నల్‌ వేసినా గూడ్స్‌ రైలు పట్టించుకోకుండా వెళ్లినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు, ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విచారం వ్యక్తంచేశారు. 'ఈ విపత్కర సమయంలో నా ఆలోచలన్నీ బాధిత కుటుంబాల వెంటే ఉన్నాయి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. సహాయక చర్యలు విజయవంతమవ్వాలి' అని ముర్ము ఆకాంక్షించారు. 
 
పశ్చిమబెంగాల్‌లో చోటుచేసుకున్న రైలు ప్రమాద ఘటన తీవ్ర విచారకరమని ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఆయన.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని ఆరా తీశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఘటనాస్థలానికి బయల్దేరినట్లు వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు