ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఢిల్లీ మాజీ మంత్రి కపిల్ మిశ్రా మరోమారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై మాటలదాడి చేశారు. కేజ్రీవాల్.. ఏడాదిలో రెండుసార్లు మాత్రమే సీఎం కార్యాలయానికి వస్తారంటూ ట్విటర్ ద్వారా కామెంట్స్ చేశారు. తమ అవినీతి బాగోతం బయటపడటంతో ఆప్ నేతలు భయపడుతున్నారని.. వారికి కేజ్రీవాల్ ధైర్యం చెప్తున్నారంటూ పోస్ట్ చేశారు.
"ఈ అవినీతి ఆరోపణలు ప్రజలు మరో 15 రోజుల్లో మర్చిపోతారు. వారికి భయపడకండి అని కేజ్రీవాల్ ఆప్ నేతలకు చెబుతున్నారు. దేశంలోని ముఖ్యమంత్రులందరిలో అరవింద్ కేజ్రీవాల్ హాజరు మాత్రమే చాలా తక్కువగా ఉంది. కార్యాలయానికి వెళ్లకుండా, మంత్రులతో ఎలాంటి సమావేశాలకు హాజరుకాని ఏకైక ముఖ్యమంత్రి ఆయనే. అంతేకాదు ఎక్కువగా సెలవులు పెడుతూ అవినీతి కేసులు ఉన్న సీఎం కూడా కేజ్రీవాలే" అంటూ విమర్శలు చేశారు.