కర్ణాటకలో పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి చూపారు. వధూవరులు, వృద్ధులు ఎండలు మండిపోతున్నా.. క్యూలైన్లలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వివాహ అలంకరణలతోపాటు ఓట్లేసిన వధూవరుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో నవ వధూవరులు మల్లికార్జున్, నిఖిత పట్టుబట్టలు, పూలదండల అలంకరణలతో వచ్చి ధార్వాడ్‌లోని 191-ఏ పోలింగ్ బూత్‌లో ఓట్లు వేశారు.
కానీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా తుముకూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పరస్పర దాడులకు పాల్పడ్డారు. విజయనగర నియోజకవర్గంలో ఈ రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. బాదామిలో పోలీస్ స్టేషన్ వద్ద ఇరుపార్టీల కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. గాయపడ్డ కార్యకర్తలను సమీప ఆసుపత్రికి తరలించారు.