క్లైమాక్స్‌కు చేరిన కర్నాటక రాజకీయం : నేడు కుమార స్వామి రిజైన్?

గురువారం, 11 జులై 2019 (10:00 IST)
కర్నాటక రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ముగ్గరు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్ - జేడీఎస్ సంకీర్ణ సర్కారు మరింత సంక్షోభంలో కూరుకునిపోయింది. ఈ పరిణామాలన్నింటినీ బేరీజువేసిన ముఖ్యమంత్రి కుమార స్వామి తన పదవికి రాజీనామా చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. 
 
రాజీనామాలు చేసిన రెబెల్ ఎమ్మెల్యేలు ఏమాత్రం వెనక్కి తగ్గక పోవడం, పైగా, వారంతా సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో సీఎం కుమార స్వామి ముందున్న అన్ని దారులు మూసుకునిపోయాయి. దీంతో ఇక రాజీనామా తప్ప మరో మార్గం లేదని భావిస్తున్న కుమారస్వామి దానికే మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాలకు ముందే ఆయన రాజీనామా చేయవచ్చని భావిస్తున్నారు.
 
నిజానికి కాంగ్రెస్ - జేడీఎస్ సంకీర్ణ సర్కారును నిలబెట్టేందుకు కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, మంత్రి డీకే శివకుమార్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్‌లోకి వెళ్లేందుకు కూడా ఆయనకు ముంబై పోలీసులు అనుమతి ఇవ్వలేదు. 
 
ఇదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన హొసకోటే ఎమ్మెల్యే, మంత్రి ఎంటీబీ నాగరాజు, చిక్కబళ్లాపుర ఎమ్మెల్యే కె.సుధాకర్‌లు బుధవారం రాజీనామా చేయడంతో కాంగ్రెస్-జేడీఎస్ సర్కారు పతనం అంచుకు చేరుకుంది. వరుస పరిణామాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కుమారస్వామి బుధవారం రాత్రి తండ్రి, మాజీ ప్రధాని దేవెగౌడను కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా తన రాజీనామాపై చర్చించినట్టు తెలుస్తోంది. శాసనసభ సమావేశాలు ప్రారంభమవడానికి ముందే ఆయన తన రాజీనామా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు