కర్ణాటక ఎన్నికల ఫలితాలు : సింపుల్ మెజార్టీ దిశగా బీజేపీ

మంగళవారం, 15 మే 2018 (10:25 IST)
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ సింపుల్ మెజార్టీని సాధించనుంది. మంగళవారం వెలువడుతున్న ఎన్నికల ఫలితాల్లో ఆ పార్టీకి ఏకంగా 113 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అలాగే, కాంగ్రెస్ 63, బీజేపీ 43, ఇతరులు ఒక చోట ఆధిక్యంలో ఉన్నారు.
 
ఇదిలావుంటే, ఒకవైపు ఓట్ల లెక్కింపు జరుగుతూ ఆధిక్యాలు వెలువడుతుండగా మరోవైపు బీజేపీ నేతలు సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాము ఇప్పటికే 113 సీట్లు దాటేశామని, జేడీఎస్‌తో పొత్తు ప్రసక్తే లేదని ఆ పార్టీ సీనియర్ నేత సదానంద గౌడ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. 
 
మరోవైపు, బీజేపీ లీడింగ్‌లో ఉందంటూ ట్రెండ్స్ వెలువడుతుండటంతో బీజేపీ కార్యకర్తలు సంబరాలు మొదలుపెట్టేశారు. బెంగళూరులోని పార్టీ కార్యాలయం వద్ద ఆ పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున చేరుకుని విజయ నినాదాలు హోరెత్తిస్తున్నారు.
 
కర్ణాటక ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉండటంతో స్టాక్ మార్కెట్లు ఊపందుకున్నాయి. కౌంటింగ్ ప్రారంభంలో కాంగ్రెస్‌, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఆ తర్వాత బీజేపీ ఆధిక్యంలోకి వెళ్లింది. బీజేపీ గెలిస్తే దేశీయ మార్కెట్లు లాభపడే అవకాశముందని మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 
 
కాగా మంగళవారం ప్రీ ట్రేడింగ్‌లో ఫ్లాట్‌గా ఉన్న సూచీలు మార్కెట్‌ ప్రారంభమైనపుడు భారీ లాభాల దిశగా దూసుకెళ్లాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 200 పాయింట్లకు పైగా లాభాన్ని చవిచూసింది. ఉదయం 9.30 గంటల సమయానికి సెన్సెక్స్‌ 150 పాయింట్ల లాభంతో 35,707 వద్ద, నిఫ్టీ 32పాయింట్ల లాభంతో 10,839 వద్ద ఉన్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు