పట్టపగలు.. ఢిల్లీ నడిబొడ్డున కరుణ అనే టీచర్‌ను 22 సార్లు కత్తితో పొడిచి హత్య చేసిన సురేందర్ సింగ్ పోలీసు విచారణలో ఆసక్తికర అంశాలు వెల్లడించాడు. ఆ వివరాలను పరిశీలిస్తే కరుణకు తనకు మధ్య గత 2012 సంబంధం ఉందని, ఇపుడు తనను కాదనీ మరో వ్యక్తిని ప్రేమిస్తూ... కత్తి కూడా వాడటం తనకు తెలియదని హేళన చేస్తూ వచ్చిందన్నారు.
అదేసమయంలో కరుణ ప్రవర్తనలో తేడా కనిపించడంతో ఆమె ఫేస్‌బుక్ పేజ్ ఓపెన్ చేశానని, అందులో మోహిత్ అనే వ్యక్తితో ఆమె అనుబంధం పెచుకుంటున్న విషయం నిర్ధారణ అయిందని, ఆమె మోహిత్‌కు అభ్యంతరకరంగా ఉన్న ఫోటోలు పంపిందని, అసభ్యంగా ఛాటింగ్ కూడా చేసిందని చెప్పాడు. దీంతో వాటిపై మాట్లాడేందుకు ఆమెకు ఫోన్ చేసి తాము ఎప్పుడూ కలుసుకునే జీటీబీ మెట్రోస్టేషన్ వద్దకు రమ్మని పిలిచానని తెలిపాడు.
అయితే, ఇంకో వ్యక్తి పట్ల వ్యామోహం పనికిరాదని చెప్పే ప్రయత్నం చేయడంతో ఆమె ఎదురు తిరిగిందని, దీంతో ఫేస్‌బుక్‌లో ఆమె ఫోటోలు, ఛాటింగ్ సంగతి ఎత్తి చూపానని, తాను చేసిన తప్పుకు పశ్చాత్తాపడాల్సిన కరుణ తనను గూఢచర్యం చేస్తున్నావా? అని నిలదీసిందని, ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ చేయడాన్ని తప్పు పట్టి, తనను తిట్టిపోసిందని తెలిపాడు.
అదేసమయంలో 'నీకు కత్తి ఎలా వాడాలో కూడా తెలియదు' అంటూ కరుణ తనను ఎద్దేవా చేసిందని సురేందర్ తెలిపాడు. తనకు కత్తి ఎంత బాగా వాడటం వచ్చో చూపించాలనే ఉద్దేశంతోనే ఆమెను అన్నిసార్లు కత్తితో పొడిచానని పోలీసులకు విచారణలో తెలిపాడు. ఆమెను హత్య చేసిన తరువాత పోలీసులకు ఫోన్ చేసింది కూడా తానేనని వారికి తెలిపాడు. దీంతో పోలీసులు వారి మొబైల్ ఫోన్ లొకేషన్లను ట్రేస్ చేయగా, హత్యకు గంట ముందు నుంచి వారిద్దరూ అతను చెప్పిన ప్రదేశంలోనే ఉన్నట్లు తేలింది. దీంతో సింగ్‌ను అరెస్టు చేసి, కేసు దర్యాప్తు జరుపుతున్నారు.