తమ రాష్ట్రం వరద నీటిలో మునిగిపోవడానికి ప్రధాన కారణం తమిళనాడు రాష్ట్రమని కేరళ సర్కారు ఆరోపిస్తోంది. ఇదే అంశంపై కోర్టులో ఒక పిటిషన్‌ను కూడా దాఖలు చేయనుంది. ఇటీవల సంభవించిన ప్రకృతి ప్రకోపానికి కేరళ రాష్ట్రం అతలాకుతలమైన విషయం తెల్సిందే. ముఖ్యంగా, రాష్ట్రంలోని 14 జిల్లాలు నీట మునిగాయి. వారం పది రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన కుంభవృష్ణికి కేరళ వరద నీటిలో మునిగిపోయింది.
అయితే, కేరళ మాత్రం తమ రాష్ట్రం వరద నీటిలో మునగిపోవడానికి ప్రకృతి ప్రకోపం కాదని వాదిస్తోంది. తమ రాష్ట్రంలో వరదలకు పొరుగునున్న తమిళనాడే కారణమని ఆరోపిస్తోంది. పురాతన ముల్లై పెరియార్ రిజర్వాయర్ నుంచి ఒక్కసారిగా నీటిని విడుదల చేయడంతో ఆ నీరంతా ఇడుక్కి డ్యామ్‌లో చేరిందని కేరళ వాదిస్తోంది. దీంతో ఈ నెల 15న ఇడుక్కి డ్యామ్ గేట్లు ఎత్తివేయడంతో కేరళను వరద ముంచెత్తిందని ఆరోపించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.
అలాగే, డ్యామ్‌లో నీటి నిల్వ సామర్థ్యాన్ని 142 నుంచి 139 అడుగులకు తగ్గించాలని కోరుతోంది. కానీ కేరళ విజ్ఞప్తిని తమిళనాడు తోసిపుచ్చుతోంది. పైగా, ఇదే వ్యవహారంపై న్యాయ పోరాటం కూడా చేశాయి. ఇక్కడ తమిళనాడుకు అనుకూలంగానే కోర్టు తీర్పు వచ్చింది. దీంతో 142 అడుగుల మేరకు నీటిని నిల్వ చేస్తున్నారు.