కొన్ని రోజుల క్రితం విపరీతమైన వర్షాలతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రంలో మళ్లీ తుఫాన్ ప్రారంభమైంది. ఈ తుఫాన్ కారణంగా కేరళ రాష్ట్రంలో మళ్లీ భారీవర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ తెలియజేసింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం వలన కేరళలోని మూడు జిల్లాలలో భారీవర్షాలు కురుసే అవకాశాలున్నాయని అధికారులు చెప్పారు.
అక్టోబర్ 7వ తేది నుండి కేరళలోని ఇడుక్కి, పాలక్కాడ్, త్రిస్సూర్ జిల్లాలలో భారీవర్షాలు కురుస్తాయని కేరళ వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ విషయం అక్కడి ప్రజలకు ఆందోళన కలిగించింది. అందువలన, ప్రజలు తుఫాన్ నేపథ్యంలో తీరప్రాంతాల వాసులు, మత్స్యకారులు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని కేరళ సీఎం పినరయి విజయన్ కోరారు.
ఇక 24 గంటల్లో 12 నుండి 20 సెంటీమీటర్ల మేరకు భారీవర్షపాతం కురిసే అవకాశాలున్నాయని కేరళ వాతావరణ శాఖ తెలియజేసింది. అందువలన పర్యాటకులు కొండప్రాంతాలు, సముద్ర తీరప్రాంతాలు వెళ్లకూడదని కేరళ సీఎం విజయన్ కోరారు.