కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పవిత్రమైన శబరిమల పుణ్యక్షేత్రంలో అయ్యప్ప దర్శనానికి మహిళలకు కూడా ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసే ఉద్దేశ్యం తమకేమాత్రం లేదని ఆయన తేల్చిచెప్పారు. అదేసమయంలో అయ్యప్ప దర్శనానికి వచ్చే మహిళా భక్తులకు గట్టి భద్రతను కల్పిస్తామని, ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు కూడా చేస్తామని ఆయన తెలిపారు.
దీనిపై కేరళ సీఎం స్పందిస్తూ, శబరిమల తీర్పుపై కేరళ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేయడంలేదు. శబరిమల ఆలయాన్ని సందర్శించే మహిళా భక్తులకు పూర్తి భద్రత కల్పిస్తాం. ఆలయ పరిసరాల్లో శాంతి భద్రతలను కట్టుదిట్టం చేసేందుకు కేరళ సహా పొరుగు రాష్ట్రాల నుంచి మహిళా పోలీసులను రప్పిస్తాం. శబరిమలను సందర్శించాలని కోరుకునే మహిళలను ఎవరూ అడ్డుకోలేరు అని స్పష్టం చేశారు.
మరోవైపు, ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు సైతం మహిళా ప్రవేశంపై వ్యతిరేకత వ్యక్తం చేసింది. సుప్రీం తీర్పుపై ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు పద్మాకుమార్ మాట్లాడుతూ, 'నిజమైన మహిళా అయ్యప్ప భక్తులు శబరిమలను దర్శించుకోరు. కేవలం మహిళా సంఘాల కార్యకర్తలే ఇక్కడికి వస్తారు' అని వ్యాఖ్యానించారు. కాగా, సుప్రీంకోర్టు తీర్పునకు నిరసనగా కేరళలో వేలాది మంది మహిళలు ర్యాలీ నిర్వహించారు.