అయ్యప్పను దర్శించుకున్న మహిళను ఇంటి నుంచి గెంటేసిన అత్తింటివారు...

బుధవారం, 23 జనవరి 2019 (10:21 IST)
సుప్రీంకోర్టు తీర్పుతో శబరిమల అయ్యప్ప స్వామిని 39 యేళ్ళ కనకదుర్గ అనే మహిళ దర్శనం చేసుకుంది. అయ్యప్ప దర్శనం తర్వాత ఆమె గత కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్లింది. ఇటీవలే ఇంటికి వెళ్లగా, ఆమెపై అత్త దాడిచేసింది. ఈ దాడిలో గాయపడిన కనకదుర్గ.. ఆస్పత్రిలో చికిత్స పొందింది. చికిత్స పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్లిన ఆమెను.. అత్తింటివారు ఇంట్లోకి రానివ్వలేదు. 
 
మతపరమైన ఆచారాలను ధిక్కరించి అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకుందన్న కారణంతో వారు ఈ చర్యకు పాల్పడ్డారు. దీనిపై కనకదుర్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కనకదుర్గను తిరిగి ఇంటికి తీసుకెళ్లగా... అప్పటికే ఆమె భర్త ఇంటికి తాళం వేసి తల్లి, ఇద్దరు పిల్లలతో కలిసి ఎక్కడో వెళ్లిపోయినట్లు గుర్తించారు. 
 
దీంతో కనకదుర్గను ప్రభుత్వ ఆశ్రయ గృహానికి తరలించారు. శబరిమల ఆలయంలోకి 10 - 50 యేళ్ళలోపు మహిళల ప్రవేశంపై దశాబ్దాలుగా ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు గతేడాది సెప్టెంబర్ 28న తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.
 
ఈ నేపథ్యంలో కనకదుర్గతో పాటు బిందు అమ్మిని అనే 40 యేళ్ళ మహిళ తొలిసారిగా శబరిమల ఆలయంలోకి ప్రవేశించడం సంచలనం సృష్టించింది. అయితే ఆందోళనకారుల నుంచి ప్రమాదం ఉన్న నేపథ్యంలో వారిద్దరినీ కొచ్చి శివారులోని రహస్య ప్రాంతంలో కొద్దిరోజుల పాటు పోలీసులు దాచారు.
 
అనంతరం జనవరి 15న కనకదుర్గ తిరిగి ఇంటికి వెళ్లగా ఆమెపై అత్త దాడి చేశారు. ఈ క్రమంలో కనకదుర్గతో పాటు బిందు అమ్మినికి 24 గంటలూ రక్షణ కల్పించాలని కేరళ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు