ఒరిస్సా రాష్ట్రంలోని పూరి జగన్నాథ రథయాత్ర శుక్రవారం నుంచి ప్రారంభంకానుంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా ఈ యాత్రకు బ్రేకులు పడ్డాయి. కానీ, ఈ యేడాది మాత్రం రథయాత్రకు అనుమతిచ్చారు. దీంతో గురువారం నుంచే పూరి నగరం భక్తుల జనసంద్రాన్ని తలపించింది.
ఈసారి యాత్రకు 15 లక్షల మంది భక్తులు వస్తారన్న అంచనాతో యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. రథయాత్ర నేపథ్యంలో తూర్పు కోస్తా రైల్వే 205 ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. అన్ని ప్రాంతాల నుంచి మరో వెయ్యి బస్సులు నడుపుతున్నారు. తాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పిస్తున్నారు.
సంప్రదాయం ప్రకారం జగన్నాథుడి సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి గుండిచా మందిరానికి రథాల్లో చేరుకుంటారు. ఊరేగింపునకు నందిఘోష్ (జగన్నాథుడి రథం), తాళధ్వజ (బలభద్రుడిది), దర్పదళన్ (సుభద్ర) రథాలు సిద్ధమయ్యాయి. పూరీ పట్టణం లక్షల మంది భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ నగర వ్యాప్తంగా ఐదు అంచెల భద్రత కల్పించారు. రథయాత్రలో తొక్కిసలాటకు తావు లేకుండా బందోబస్తు చేశామని డీజీపీ సునీల్ బన్సల్ తెలిపారు.