ఈ నెల 27వ తేదీ వరకు తమిళనాడు నుంచి కర్ణాటకకు వెళ్ళే లారీల చక్రాలు ఆగిపోనున్నాయి. కావేరి జల వివాదం నేపథ్యంలో 27వ తేదీ వరకు లారీలను కర్ణాటకకు పోనిచ్చేది లేదనే నిర్ణయానికి వచ్చినట్లు తమిళనాడు లారీ సంఘాల అధినేత కుమార స్వామి తెలిపారు. కావేరీ వివాదంతో.. తమిళనాడు బోర్డుతో గల దాదాపు 70 లారీలను, 50 బస్సులకు నిరసనకారులు నిప్పంటించారని.. అందుచేత తమిళనాడు లారీలు ప్రస్తుతానికి కర్ణాటక వెళ్ళడం మంచిది కాదన్నారు. దీంతో ఒక రోజుకు రూ.100 కోట్ల నష్టం ఏర్పడుతుంది.
సాధారణంగా కర్ణాటకకు 50 శాతం ఎల్పీజీ ట్యాంకర్ లారీలు మాత్రమే నడుస్తున్నాయి. తద్వారా సిలిండర్ల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. కావేరీ జలాలపై కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నట్లు చేపట్టిన దీక్షలో ఈ నెల 27వ తేదీ వరకు లారీలను కర్ణాటకకు నడిపేది లేదని నిర్ణయించారు. ఉద్రిక్తత కారణంగా కర్ణాటక-తమిళనాడు సరిహద్దుల్లో వేలాది వాహనాలు నిలబడిపోయాయి. కర్ణాటకలో ఇతర రాష్ట్రాల లారీలకు భద్రత కల్పిస్తామని ఆ రాష్ట్ర సర్కారు హామీ ఇస్తేనే లారీలను నడిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు కుమార స్వామి వెల్లడించారు.
ఇదిలా ఉంటే.. కర్ణాటక రాజ్యాంగ సంక్షోభం సృష్టించేందుకు ప్రయత్నం చేస్తోందని పీఎంకే వ్యవస్థాపకుడు ఎస్ రామదాస్ అన్నారు. కావేరీ జలాల సమస్య అంశం ద్వారా గట్టి పాఠం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. తన వద్ద నీళ్లు లేవని కర్ణాటక చెప్పేదంతా కూడా ఓ అబద్ధం అని ఆయన మండిపడ్డారు. ఆదేశాల ప్రకారం 23 వరకు రోజుకు ఆరు వేల క్యూసెక్కులు నీళ్లు తమిళనాడుకు ఇవ్వకుండా కర్ణాటక ఆపేయడం సుప్రీంకోర్టును అవమానించడమేనని వెల్లడించారు.
కావేరీ జలాలపై కర్ణాటక సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరిస్తూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని, అసెంబ్లీలో తీర్మానం చేసి ఇదొక రాజకీయ-చట్టపరమైన సమస్యగా మార్చాలని ప్రయత్నిస్తోందని రామదాసు వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ 27న కావేరీ జలాలపై సుప్రీంకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో ఆ రోజు తమ రాష్ట్ర ప్రభుత్వం నీటి విడుదల చేయకూడదని నిర్ణయం తీసుకుందని దానికి సంబంధించిన తీర్మానం సుప్రీంకోర్టులో ఉంచాలని చూస్తోందన్నారు.