మధ్యప్రదేశ్ సంక్షోభం : లైవ్ స్ట్రీమింగ్‌లో కమల్నాథ్ సర్కారు బలపరీక్ష

శుక్రవారం, 20 మార్చి 2020 (07:51 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం ఎట్టకేలకు తెరపడనుంది. దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ప్రభుత్వం బలపరీక్షను ఎదుర్కోనుంది. ఈ బలనిరూపణ పరీక్ష జరిగే సమయంలో అసెంబ్లీ సమావేశాలను వీడియోగా చిత్రీకరించాలనీ, వీలైతే లైవ్ స్ట్రీమింగ్ చేయాలని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆదేశించారు. 
 
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కమల్‌నాథ్ సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే, అదే పార్టీకి చెందిన యువనేత జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. దీంతో ఆయన వర్గానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. వీరిలో ఆరుగురు మంత్రులు కూడా ఉన్నారు. దీంతో కమల్‌నాథ్ ప్రభుత్వం మైనార్టీలో పడింది. 
 
ఇదే అంశంపై గవర్నర్‌ లాల్జీ టాండన్‌ను కలిసి బీజేపీ నేతలు అవిశ్వాస పరీక్షకు ఆదేశించాలని కోరారు. ఫలితంగా గవర్నర్ టాండన్ సభలో బలనిరూపణ చేసుకోవాలని ఆదేశించారు. కానీ, స్పీకర్ ఎన్.ఆర్ ప్రజాపతి ఈ బలపరీక్షను నిర్వహించకుండా, ఈ నెల 26వ తేదీకి సభను వాయిదావేశారు. 
 
దీంతో బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీం... శుక్రవారం సాయంత్రం 5 గంటలకు బలనిరూపణకు జరగాలని ఆదేశించింది. ఈ మేరకు స్పీకర్ ఎన్పీ ప్రజాపతికి ఆదేశాలు జారీచేసింది. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలని సూచించింది. కమల్‌నాథ్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బలనిరూపణ చేసుకునే సమయంలో అసెంబ్లీ సమావేశాలను వీడియోగా చిత్రీకరించాలని, వీలైతే లైవ్ స్ట్రీమింగ్ చేయాలని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.
 
అంతేకాదు, 16 మంది రెబెల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బలనిరూపణ సందర్భంగా అసెంబ్లీకి హాజరయ్యే పక్షంలో వారికి భద్రత కల్పించాలంటూ మధ్యప్రదేశ్, కర్ణాటక డీజీపీలను ఆదేశించింది. ఎలాంటి అవరోధాలు కల్పించని విధంగా బలనిరూపణే ఏకైక అజెండాగా సభ నిర్వహించాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ అసెంబ్లీలో తన ప్రభుత్వ బలాన్ని నిరూపించుకోనున్నారు. ఈ బలపరీక్షలో విఫలమైతే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోనుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు