తెలుగు విద్యార్థులకు ఊరట : 'తమిళ సర్కారు'కు హైకోర్టు మొట్టికాయ.. తెలుగు నేతల కృషి ఫలితం

మంగళవారం, 24 నవంబరు 2015 (11:47 IST)
తమిళనాడులో తెలుగు విద్యార్థులకు (మైనార్టీ భాషా విద్యార్థులకు) ఊరట లభించింది. భాషా దురభిమానంతో మైనారిటీ భాషల ఉసురు తీయాలనుకున్న తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తీర్పు చెంపపెట్టులా మారింది. ఆదినుంచి మాతృభాషలోనే చదువుకుని పరీక్షలు రాయాలనుకున్న విద్యార్థుల నెత్తిన పాలు పోసిన చందంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో వచ్చే మార్చి నెలలో జరుగనున్న పదో తరగతి పరీక్షలను తమ మాతృభాషలోనే రాసుకునే వెసులుబాటు లభించింది. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... 
 
2006లో డీఎంకే ప్రభుత్వం తీసుకొచ్చిన 'నిర్బంధ తమిళం' జీవో మేరకు వచ్చే ఏడాది జరిగే పదో తరగతి పరీక్షల్ని తెలుగు, కన్నడం, మలయాళం, ఉర్దూ భాషా విద్యార్థులు తమిళంలోనే రాయాలని తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలను నిరసిస్తూ కొంతకాలంగా ఇక్కడి తెలుగు ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. అయినా జయలలిత ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో అఖిల భారత తెలుగు సమాఖ్య నేతృత్వంలోని మైనారిటీ భాషా సంఘాలు మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించాయి. 
 
ఈ కేసు విచారణ చేపట్టిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్కే.కౌల్‌, న్యాయమూర్తి పి.సత్యనారాయణనలతో కూడిన ప్రథమ ధర్మాసనం సోమవారం మైనారిటీ భాషల వారికి ఊరటనిచ్చే ఆదేశాలను జారీ చేసింది. పదో తరగతి చదువుతున్న మైనారిటీ భాషా విద్యార్థులంతా తమిళంలోనే పరీక్ష రాయాలని తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలకు మద్రాసు హైకోర్టు బ్రేక్‌ వేసింది. వచ్చే ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షల్ని ఈ విద్యార్థులు మాతృభాషలోనే రాయవచ్చని స్పష్టం చేసింది. 
 
నిర్బంధ తమిళంపై చేసిన చట్టం సదుద్దేశంతో రూపొందించినది కాదని, ఆ తర్వాత కూడా ఈ చట్టాన్ని సక్రమంగా అమలు చేయలేదని కోర్టు అభిప్రాయపడింది. 2006లో చట్టం రూపొందగా, ఆరేళ్ల తర్వాత 2012లో ఇందుకు సంబంధించిన నియమ నిబంధనలు రూపొందించారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ యేడాది పదో తరగతి పరీక్షలకు సంబంధించి మైనారిటీ భాషా విద్యార్థులు తమ పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా దరఖాస్తు చేయాలని అటువంటి వారికి 30 రోజుల్లోగా వారి మాతృభాషల్లో పరీక్షలు రాయడానికి సంబంధించి మరికొంత వెసులుబాటు కోరుతూ మైనారిటీ భాషాప్రతినిధులు మరో పిటీషన్ దాఖలు చేయాలని ఈ సందర్భంగా ధర్మాసనం సూచన చేసింది. 
 
హైకోర్టు తీర్పుపై చెన్నైలోని పలువురు తెలుగు ప్రముఖులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. మద్రాసు ధర్మాసనానికి శతకోటి కృతజ్ఞతలంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు సంఘాల తరపున ఈ పిటీషన్ దాఖలు చేసి నగరంలోని అఖిల భారత తెలుగు సమాఖ్య అధ్యక్షుడు డాక్టర్ సీఎంకే రెడ్డి మాట్లాడుతూ... మద్రాసు హైకోర్టు ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం సహృదయంతో అర్థం చేసుకోవాలని సూచించారు. భవిష్యత్‌లో కూడా రాష్ట్రంలోని మైనార్టీ విద్యార్థులు తమ మాతృభాషల్లోనే పరీక్షలు రాసేలా అవకాశం కల్పిస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. పైగా.. గత ఆరు సంవత్సరాలుగా చట్టం అమలులో పలు లోపాలున్నట్టు ధర్మాసనం గుర్తించిందని ఆయన చెప్పుకొచ్చారు. 
 
అలాగే, ద్రావిడదేశం అధ్యక్షుడు వి.కృష్ణారావు స్పందిస్తూ ప్రభుత్వం, రాజకీయ నేతలు తెలుగువారికి సహకరించకపోయినా న్యాయ దేవత మనవైపు ఉందని హైకోర్టు తీర్పుతో వెల్లడైందన్నారు. అందుకే ఈ తీర్పును వెలువరించిన న్యాయమూర్తులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు చెప్పారు. రాష్ట్ర సర్కారు తెలుగు వారి బాధలను గుర్తించక పోయినా న్యాయస్థానం మన బాధను అర్థం చేసుకోవడమే కాకుండా, ప్రత్యేకంగా గుర్తించిందని చెప్పుకొచ్చారు. ఈ తీర్పు తాత్కాలికమేనని, శాశ్వత పరిష్కారం కోసం మళ్లీ హైకోర్టును ఆశ్రయించాల్సిందేనని, అపుడు కూడా మనకు న్యాయం జరుగుతుందన్న విశ్వాసాన్ని వి కృష్ణారావు వ్యక్తం చేశారు. 
 
ఆ తర్వాత ప్రముఖ సినీ గేయ రచయిత వెన్నెలకంటి మాట్లాడుతూ.. తెలుగు భాష కోసం పోరాడుతున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు. తమ పిల్లలను కార్పొరేట్ పాఠశాలల్లో చదివించే అవకాశం, శక్తిసామర్థ్యాలున్నప్పటికీ వాటన్నింటినీ కాదని మాతృభాషలోనే చదివించామన్నారు. ఇపుడు వారు ఆ అక్షరాల ఆధారంగానే జీవిస్తున్నారు. వారి పిల్లలూ తెలుగులోనే చదువుతున్నారు. రేపటి రోజున ఈ భాషా సమస్య మళ్లీ ఎదురుకావొచ్చు. పైగా ఈ సమస్య నా ఒక్కడిది కాదు. ప్రతి ఒక్కరిదీ. ఇక్కడున్న తెలుగువారందరి సమస్య. అందుకే ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉండి శాశ్వతంగా సమస్యను పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు.

వెబ్దునియా పై చదవండి