దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతున్న వేళ కరోనా బాధితులను బ్లాక్‌ఫంగస్ వేధిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఢిల్లీ, మధ్యప్రదేశ్, గుజరాత్‌తో పాటు పలు రాష్ట్రాల్లో ఈ కేసులు వెలుగు చూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.
'ఇప్పటివరకు రాష్ట్రంలో 2వేలకు పైగా బ్లాక్‌ఫంగస్ బాధితులు ఉండవచ్చు. కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో బ్లాక్‌ఫంగస్ కేసులు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రుల్లో బ్లాక్‌ఫంగస్ బాధితులకు ప్రత్యేకంగా చికిత్స అందిస్తాం' అని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తోపే పేర్కొన్నారు. ఈ బాధితులకు పలు విభాగాల చికిత్స అవసరం అవుతున్నందున ముందుజాగ్రత్త చర్యగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు.
మ్యూకోర్‌మైకోసిస్ బాధితులకు ఈఎన్‌టీ, కంటి చూపు, న్యూరో వైద్యుల సహాయం అవసరమవుతుందని రాజేష్ తోపే పేర్కొన్నారు. ఇలాంటి వారికి రాష్ట్ర ప్రభుత్వ పథకం మహాత్మ పూలే జన్ ఆరోగ్య యోజన కింద చికిత్స అందించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా ఈ చికిత్సకు వినియోగించే ఔషధాలు ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవని అన్నారు.