మహారాష్ట్రలో మహా విషాదం : ఇంటి శిథిలాల కింద 300 మంది?

శుక్రవారం, 23 జులై 2021 (07:40 IST)
మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా వరదలు సంభవించాయి. ముఖ్యంగా, అనేక ప్రాంతాల్లో వాగులు, వంకలు, నదులు పొంగిపోర్లుతున్నాయి. ముంబై మహానగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఇదే పరిస్థితి అనేక ప్రాంతాల్లో నెలలకొంది. ఈ నేపథ్యంలో ఈ భారీ వర్షాలకు బాగా తడిసిపోవడంతో 35 ఇళ్లు కూలిపోయాయి. ఈ శిథిలాల కింద 300 మంది వరకు చిక్కుకునివున్నట్టు సమాచారం. 
 
రాయ్‌గఢ్ జిల్లా మహద్ తలై గ్రామంలో గతరాత్రి ఈ ఘటన జరిగింది. ఇళ్ల శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు బయలుదేరిన సహాయక బృందాలు వరద భారీగా ఉండడంతో ఘటనా స్థలానికి చేరుకోవడం కష్టమవుతోంది. శుక్రవారం ఉదయానికి వారు ఘటనా స్థలానికి చేరుకునే అవకాశం ఉంది. 
 
కాగా, శనివారం రాత్రి ముంబై సబర్బన్‌లోని చెంబూరు భరత్‌నగర్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి 22 మంది చనిపోగా, మరికొందరు గాయపడ్డారు. భారీ వర్షాలతో మహారాష్ట్ర అతలాకుతలం అవుతోంది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కాగా, రవాణా వ్యవస్థలు కుప్పకూలాయి. 
 
ముఖ్యంగా థానే, పాల్ఘర్ జిల్లాలతోపాటు కొంకణ్ ప్రాంతంలో వరదలు ముంచెత్తుతున్నాయి. దూరప్రాంతాలకు వెళ్లే రైలు సర్వీసులను అధికారులు రద్దు చేశారు. మరికొన్నింటిని సవరించారు. కొంకణ్ రైల్వే రూట్‌లో దాదాపు 6 వేల మంది రైలు ప్రయాణికులు చిక్కుకుపోయినట్టు అధికారులు తెలిపారు. 
 
రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. గత రాత్రి నుంచి వశిష్ట నది, దామ్ నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాల్సిందిగా సమీప ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. చిప్లిన్‌లో బస్, రైల్వే స్టేషన్లు, స్థానిక మార్కెట్ నీట మునిగాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు