మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి ఖడ్సే రాజీనామా.. దావూద్ ఫోన్‌కాల్స్ ఎఫెక్ట్!

శనివారం, 4 జూన్ 2016 (15:18 IST)
మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సే తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు అందజేశారు. దీంతో మహారాష్ట్రలో హైడ్రామా రాజకీయాలకు తెరలేసింది. 
 
బీజేపీ మహారాష్ట్ర శాఖలో కీలక నేతగా ఎదిగిన ఖడ్సేకు అండర్ వరల్డ్ మాఫియా డాన్, భారత్ మోస్ట్ వాంటెడ్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలున్నాయన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెల్సిందే. దీనిపై బీజేపీ మిత్రపక్షమైన శివసేన మండిపడింది. ఈ వ్యవహారం తేలకముందే ఖడ్సేపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. 
 
ఈ పరిస్థితుల్లో మంత్రి పదవికి రాజీనామా చేయాలన్న మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ విజ్ఞప్తికి ఖడ్సే ససేమిరా అన్నారు. దీంతో చేసేదేమీ లేక ఫడ్నవీస్ శుక్రవారం ఢిల్లీ వెళ్లి పరిస్థితిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలకు వివరించారు. ఈ వ్యవహారంపై మోడీ, అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఖడ్సే దిగిరాక తప్పలేదు. దీంతో శనివారం ఢిల్లీకి చేరుకున్న ఆయన తన పదవికి రాజీనామా చేశారు. 

వెబ్దునియా పై చదవండి