ఇక నిశ్చింతగా చనిపోతా... పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ

బుధవారం, 31 ఆగస్టు 2016 (20:39 IST)
సింగూర్ భూములపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ స్పందించారు. సింగూర్ భూములకు చెందిన రైతులకు సుప్రీం తీర్పుతో న్యాయం జరిగిందనీ, ఇకపై తాను నిశ్చింతగా చనిపోతానని చెప్పుకొచ్చారు. 
 
టాటా మోటార్స్‌కు సింగూరులో నానో కార్ల తయారీ కోసం కేటాయించిన 1000 ఎకరాల భూములను రద్దు చేస్తూ, వాటిని స్వంతదారులకు పది రోజుల్లో తిరిగి అప్పగించాలని సుప్రీంకోర్టు బుధవారం ఇచ్చిన సంచలన తీర్పు ఇచ్చిన విషయం తెల్సిందే. 
 
దీనిపై మమతా బెనర్జీ స్పందించారు. 'సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎంతగానో ఎదురుచూశా. ఇక నిశ్చింతగా చనిపోతా' అంటూ ఉగ్విగ్నభరిత స్వరంతో స్పందించారు. 'సుప్రీంకోర్టు తీర్పు నా చిరకాల కల. సింగూర్ ప్రజలకు న్యాయం జరగాలని పరితపించా. నా కల ఫలించింది. రైతుల భూములు వారికి తిరిగివ్వాలంటూ తీర్పు వచ్చింది. ఇక నిశ్చింతగా చనిపోవచ్చు' అని ఆమె వ్యాఖ్యానించారు. 
 
తీర్పు కోసం పదేళ్లుగా ఎదురుచూశామని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రైతుల విజయమని ఆమె అన్నారు. సింగూర్ ఉత్సవాన్ని ప్రతి ఒక్కరూ దుర్గాపూజ ఉత్సవాన్ని తలపించేలా జరుపుకొంటారని ఆశిస్తున్నానని అన్నారు. నానో ప్రాజెక్టుకు వేలాది ఎకరాలను వామపక్ష ప్రభుత్వం కట్టబెట్టడాన్ని 2006లో మమతాబెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ సింగూరులో ఆందోళనలు చేపట్టిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి