రష్యా విమానాశ్రయంలో పాములా? అవి విషపూరితమా?

శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (16:54 IST)
విమానాశ్రయంలో పాములా..? నిజమా? అనుకుంటున్నారు కదూ.. అవునండి.. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 20 పాములు విమానాశ్రయంలో కనిపించాయి. అంతే ప్రయాణీకులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఈ ఘటన రష్యాలోని షెరెమెటివో అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జర్మనీ నుంచి రష్యా వెళ్తున్న ఓ ప్రయాణికుడి వద్ద ఉన్న సంచిపై విమానాశ్రయ అధికారులకు అనుమానం వచ్చింది. 
 
సంచిని తనిఖీ చెయ్యగా సంచిలో 20 పాములు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పాములను చిన్న చిన్న పెట్టెల్లో ఉంచి వాటిని ఓ సంచిలో పేర్చి తీసుకొచ్చాడు. జర్మనీలో పాములు కొని వాటిని రష్యాకు తీసుకొచ్చినట్లు అధికారులు చెప్పారు. పాములను కొనుగోలు చేసినట్లు తగిన పత్రాలు వుండటంతో జర్మనీలోని డస్సల్‌డర్ఫ్‌ విమానాశ్రయంలో అధికారులు ఆపకపోయి ఉండొచ్చునని రష్యా షెరెమెటివో అధికారులు తెలిపారు. 
 
అయితే జర్మనీ నుంచి పాములను రష్యాకు తీసుకెళ్లేందుకు ఎలాంటి అనుమతుల్లేవని విమానాశ్రయ అధికారులు తెలిపారు. కానీ ఈ పాములు విషపూరితమైనవి కావని ప్రయాణీకుడు చెప్పాడు. ఇలా పాములను ఓ చోట నుంచి మరో ప్రదేశానికి తీసుకెళ్లడం జర్మనీలో నేరం కాదని ఆ దేశానికి చెందిన పోలీసులు ఓ వార్తాసంస్థకు తెలిపారు. 
 
కానీ పాములు తరలింపు విషయంలో ఎలాంటి స్పష్టమైన నిర్ణయం రాకపోవడంతో వచ్చేవరకు ప్రస్తుతం ఆ పాములు మాస్కోలో జంతు సంరక్షణ అధికారుల పర్యవేక్షణలో ఉంచారు అధికారులు. ఇలా అధికారులకు ప్రయాణీకుడికి మధ్య పాముల తరలింపులో వాగ్వివాదం జరుగుతున్న వేళ ప్రయాణీకులంతా భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు