శిశువు ముఖాన సిగరెట్ పొగ ఊదితే మీకు కోపం వస్తుందా? రాదా? వీడియో

శనివారం, 12 నవంబరు 2016 (10:44 IST)
శిశువు ముఖాన సిగరెట్ పొగ ఊదితే ఎలా ఉంటుంది.. ఓ యువకుడు అలా శిశువు ముఖాన సిగరెట్ పొగును ఊదుతుంటే కోపం వస్తుందిగా.. అలాంటి పనికి ఒడిగట్టిన ఢిల్లీ యువకుడిని ప్రజలు నిలదీశారు. బస్టాండ్‌లో శిశువు చేతబట్టుకుని ఓ యువతి కూర్చుని వుంటే ఆ శిశువు ముఖాన సిగరెట్ పొగను ఊదుతూ ఓ యువకుడు ఇబ్బంది పెట్టాడు. దీనిపై ప్రజలు ఫైర్ అయ్యారు. చివరికి అదంతా నటనేనని తేలింది. 
 
ఇంతకీ విషయం ఏమిటంటే.? దేశ రాజధాని నగరమైన ఢిల్లీని గత కొంతకాలంగా కాలుష్యం కాటేస్తోంది. ఈ కాలుష్యం ఫలితంగా గత కొన్ని రోజులుగా విషంతో కూడిన పొగమంచుతో ఢిల్లీ జనం అల్లాడుతున్నారు. ఈ కాలుష్యం పరిస్థితి ఏ మేర ఉందంటే రోజుకు పిల్లలు కూడా ఒక్కొక్కరు 40 సిగరెట్లు తాగినంత పెను ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. 
 
ఢిల్లీ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇతరులపై ఆధారపడకుండా తమ సమస్యను తామే పరిష్కరించడానికి నడుం కట్టాలని ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు కొందరు యువకులు వినూత్న ప్రయోగం చేశారు. ఢిల్లీలో ఒక బస్ స్టాప్ వద్ద ఓ యువతి తన ఒడిలో శిశువును పెట్టుకొని కూర్చుంటుంది. పక్కనే ఉన్నఓ యువకుడు సిగరెట్ తాగుతూ పొగను పక్కన యువతి ఒడిలో ఉన్నశిశువు ముఖం మీదకు రింగురింగులుగా వదులుతుంటాడు. 
 
అంతే బస్టాప్‌లో ఉన్న తోటి యువకులు ఈ సంఘటన చూసి అసహనానికి గురై సిగరెట్ పొగ వదులుతున్న యువకుడిపై ఫైర్ అవుతారు. శిశువు ముఖం మీద సిగరెట్ పొగ వదిలితే తనను ఎందుకు అడ్డుకుంటున్నారని, మనమంతా ఢిల్లీలో ప్రతిరోజూ విష వాయువులు పీలుస్తున్నామని ఆ యువకుడు సమాధానం చెప్పి అందరినీ ఆలోచింపజేశాడు. ఈ వీడియో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారింది. ఈ వీడియోను మీరూ చూడండి.
 

వెబ్దునియా పై చదవండి