ఎలాంటి మటన్ తింటున్నారో తెలుసా.. కుళ్లిన మాంసానికి వందలు తగలేస్తున్నారు..

మంగళవారం, 4 ఏప్రియల్ 2017 (02:57 IST)
ఇంటి భోజనం కంటే మించిన ఆహారం మరెక్కడా లేదని తెలిసినా సరే పొరుగించి పుల్లకూర రుచికి మన నాలుక జివ్వున లాగుతుంది. అదే మనదేశంలో నానాజాతి హోటళ్ల గల్లా పెట్టెలు నింపుతోంది. మన మహానగరాల్లో టన్నుల కొద్దీ లాగించేస్తున్న మాంసం, ముఖ్యంగా మటన్ భయంకరమైన రోగాలకు ఆలవాలంగా ఉంటోందని తనిఖీ అధికారులు మొత్తుకుంటున్నా జనం వినరు. బిర్యానీలు, మాంసాహార వంటకాల పేర్లు వినగానే మాంసాహారప్రియుల మనస్సు లాగేస్తుంది. ఆ  బలహీనతే హోటల్ యజమానుల పంట పండిస్తోంది
 
రకరకాల బిర్యానీలకు మారుపేరైన హైదరాబాద్ నగరంలో మటన్ బిర్యానీ అంటేనే పారిపోవలసిన రోజులు దాపురిస్తున్నాయా అంటే అవుననే చెప్పాలి. నగరంలోని పలు హోటళ్లలో కనీస ప్రమాణాలు పాటించకుండా, అపరిశుభ్ర వాతావరణంలో తినడానికి పనికిరాని మాంసం వడ్డిస్తున్న వైనం సాక్షాత్తూ అధికారుల తనిఖీలో బయటపడింది. నగరంలోని పలు హోటళ్లలో మాంసంగా వాడటానికి వీల్లేని రోగాలతో కూడిన గొర్రెలు, పశువుల మాంసాన్ని వంటకాల్లో వినియోగిస్తుండటం చూసిన తనిఖీ అధికారుల కళ్లు బైర్లు కమ్మాయి.
 
9నెలల కంటే తక్కువ వయసున్న  మేకలు, గొర్రెల్ని,  మూడేళ్లలోపు పశువులు, అనారోగ్యంగా ఉన్నవాటిని వధించరాదని నిబంధనలున్నా పట్టించుకోవడం లేదు. వెటర్నరీ వైద్యుల పర్యవేక్షణలో ఆరోగ్యకరంగా, తగిన వయసులో ఉన్న మేకలు, గొర్రెలు, పశువుల మాంసాన్నే  ఆహారంగా తీసుకోవాలని నిబంధనలు పేర్కొంటున్నప్పటికీ ఏ ఒక్క హోటల్ కూడా అందుకు పూనుకున్నది లేదు.ఎక్కడ పడితే అక్కడ వధించిన, అనారోగ్యం,, మరీ లేత, ముదిరిపోయిన, ముసలి జీవాలు, పశువుల మాంసాన్ని వండి ప్రజలకు వడ్డిస్తున్నాయి.
 
ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్లాటర్‌ హౌస్‌లలో రోజుకు 2వేల మేకలు , గొర్రెల్ని శాస్త్రీయ పద్ధతుల్లో వధించే సామర్ధ్యం ఉన్నప్పటికీ కేవలం 50 నుంచి 150 మాత్రమే అక్కడకు వస్తున్నాయి. అంటే నాణ్యతా ప్రమాణాలకు పాతరేసి యథేచ్చగా బహిరంగ ప్రాంతాల్లో వాటిని వధించి హోటళ్లకు తరలిస్తున్నారు. జియాగూడలోని 11 ఎకరాల్లో ప్రైవేటుగా ప్రతిరోజూ దాదాపు ఆరువేల  మేకలు, గొర్రెలు వధిస్తున్నారు. నగరంలో సరఫరా అవుతున్న మాంసంలో దాదాపు  70 శాతం మేకలు, గొర్రెల్ని ఇక్కడే వధిస్తుండటం గమనార్హం. 
 
జంతువుల్ని వధించిన తర్వాత రక్తనాళాల్లో రక్తం ఇంకిపోయిన తర్వాత మాత్రమే వాటినుంచి తోలును వేరు చేయాల్సి ఉంటుందని నిపుణుల సూచన. ఒక జంతువు రక్తం మరో జంతువు రక్తంతో కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అయినా పాటించడం లేదు. మాంసాన్ని 120 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వరకు వేడి చేశాకే ఆహారంగా తీసుకోవాలి. ఫ్రిజ్‌లలో నిల్వ చేసిన మాంసాన్ని తగిన ఉష్టోగ్రత వరకు వేడిచేయకుండానే వండకూడదు. దీనివల్ల భయంకర వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నా జనం పాటించరు. హోటల్లు అసలు పాటించరు. 
 
ఇలాంటివన్నీ చూస్తే, వింటే మాంసాహారం తప్పనిసరిగా మన ఆహారంలో భాగంగా ఉండాల్సిందేనా అనే సందేహాలు కొత్తగా పుట్టకస్తాయి. అయినా ఇవన్నీ మామూలే. కొద్దిరోజులయ్యాక అన్నీ మరిచిపోతా. రాజ్యం పారాహుషార్ అని పాడుకుంటూనే ఉంటుంది.
 

వెబ్దునియా పై చదవండి