ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణంపై సీబీఐ విచారణ జరపాలని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్, విపక్ష నేత ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు. జయలలిత మరణంపై సాక్షాత్ ఆ పార్టీ సీనియర్ నేత, సీనియర్ మంత్రి దిండిగల్ శ్రీనివాసన్ సందేహాలు వ్యక్తం చేశారనీ, అందువల్ల సీబీఐ విచారణ జరిపి నిజాలను బహిర్గతం వెల్లడించాలని ఆయన కోరారు.
అనారోగ్యంతో జయ ఆస్పత్రిపాలైన తర్వాత ఆమెను చూసేందుకు ఎవ్వరినీ అనుమతించలేదని, ఆ సమయంలో జయలలిత ఆరోగ్యం గురించి తాము చెప్పిన మాటలన్నీ అవాస్తవాలని మూడ్రోజుల క్రితం మంత్రి దిండిగల్ శ్రీనివాసన్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు ఆ వ్యాఖ్యల చుట్టూనే తిరుగుతున్నాయి. అన్నాడీఎంకే బహిష్కృత నేత టీటీవీ దినకరన్ ఆత్మరక్షణలో పడిపోగా, మంత్రి వ్యాఖ్యలనే పావుగా ఉపయోగించుకుని ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ప్రతిపక్షాలు ఎత్తులు వేస్తున్నాయి.
సీబీఐ విచారణ జరిపించాలని డీఎంకే నేత స్టాలిన్ సహా ఇతరపార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు జయ మేనకోడలు దీప తన అత్త మృతిపై కోర్టుకెళ్తానని ప్రకటించారు. ఇదిలా ఉంటే.. దిండుగల్ శీనివాసన్ వాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, జయలలిత అందించిన చికిత్సపైగానీ, ఆమె మృతిపైగానీ ఎటువంటి సందేహాలు లేవని రాష్ట్ర చేనేత మంత్రి ఓఎస్ మణియన్ అన్నారు. అయితే మంత్రి దిండుగల్ శీనివాసన్ మాత్రం తన మాటలకు పూర్తిగా కట్టుబడి ఉన్నానని ప్రకటించారు.