వివరాల్లోకి వెళితే.. ముంబైలోని నాలాసోపొర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టాకీ ప్రాంతంలో ఉన్న నసీమా అపార్ట్‌మెంట్‌లో నిఖిత్ షేక్ అనే మహిళ తన భర్తతో కలిసి నివాసం ఉంటోంది. అత్తారింటివారితో ఏర్పడిన మనస్పర్ధల కారణంగా భర్తతో వేరే కాపురం పెట్టింది. ఆమె భర్త మహ్మద్ ముంబైలోని ఓలా కారుడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నిఖిత్ షేక్ నాలుగు నెలల గర్భిణి.
ఈ నేపథ్యంలో మహ్మద్ ఇంట్లో లేని సమయం చూసుకుని ఆమె మరిది సల్మాన్ షేక్ ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో నిఖిత్.. తన స్నేహితురాలు నూర్ పర్వీన్‌తో కలిసి భోజనం చేస్తోంది. ఉన్నట్టుండి ఇంట్లోకి వచ్చిన సల్మాన్ షేక్ ఆమెతో వాదులాటకు దిగాడు. పర్వీన్ అతనికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తోంది. అయినా వదినపై ఆగ్రహాన్ని ఏమాత్రం తగ్గించుకోని సల్మాన్ షేక్ అక్కడే వున్న కత్తితో దాడికి దిగాడు.
ఇలా వదినపై 16 సార్లు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో నిఖిత్ షేక్ తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ సమాచారం తెలిసిన వెంటనే నిఖిత్ షేక్ సోదరుడు సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. నాలాసోపొర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని.. పరారీలో ఉన్న సల్మాన్ షేక్ కోసం గాలిస్తున్నారు.