కరోనా కష్టాల్లోనూ కల్తీ ... వాడేసిన మాస్కులను ఉతికి - ఇస్త్రీచేసి...

శనివారం, 18 ఏప్రియల్ 2020 (09:22 IST)
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కొందరు వ్యాపారులు కరోనా కష్టకాలంలో కూడా మోసాలకు పాల్పడుతున్నారు. వాడేసిన మాస్కులను శుభ్రంగా ఉతికి, వాటిని ఇస్త్రీ చేసి తిరిగి విక్రయిస్తున్నారు. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కరోనా వైరస్ సోకకుండా ఉండాలంటే ముఖానికి మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. అయితే, కొందరు వ్యాపారులు మోసాలకు పాల్పడుతున్నారు. ఈ మాస్కుల్లో కూడా కల్తీకి పాల్పడుతున్నారు. 
 
తాజాగా మహారాష్ట్రలోని పాల్ఘర్‌కు చెందిన ముగ్గురు దుండగులు.. వాడేసిన ఎన్95 మాస్కులను సేకరించి, ఉతికి ఇస్త్రీ చేసి మళ్లీ విక్రయిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు రైడ్ చేసి వీరి వద్ద నుంచి 25వేలపైగా సెకండ్ హ్యాండ్ ఎన్95 మాస్కులు స్వాధీనం చేసుకున్నారు. 
 
వీటి విలువ రూ.50లక్షలపైనే ఉంటుందని అధికారులు వెల్లడించారు. ముగ్గురు నిందితులపై నిత్యావసరాల చట్టం, ఎపిడెమిక్స్ చట్టం, కొవిడ్ చట్టాల కింద కేసు నమోదు చేసినట్లు తెలియజేశారు. కాగా, కోవిడ్ 19 బారినపడిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉన్న విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు