తొలి రోజున 10 గంటలు.. రెండో రోజున 4 గంటలు.. రాహుల్ వద్ద ఈడీ విచారణ

మంగళవారం, 14 జూన్ 2022 (17:00 IST)
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ పూర్వ అధ్యక్షులు రాహుల్ గాంధీ వద్ద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు రెండు రోజుల పాటు విచారణ జరిపారు. తొలి రోజైన సోమవారం ఏకంగా 10 గంటల పాటు విచారణ జరిపిన ఈడీ అధికారులు రెండో రోజైన మంగళవారం నాలుగు గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈడీ అధికారుల ప్రశ్నలకు రాహుల్ లిఖిత పూర్వకంగానే సమాధానమిచ్చినట్టు సమాచారం. 
 
మరోవైపు, మంగళవారం ఉదయం 11.05 గంటలకు ఈడీ కార్యాలయానికి చేరుకున్న రాహుల్ గాంధీ దాదాపు 4 గంటలకు పైగా విచారణ తర్వాత బయటకు వచ్చారు. అయితే, ఆయన తిరిగి ఈడీ కార్యాలయానికి వస్తారా? లేదంటే ఈడీ విచారణ ముగిసిందా? అనే విషయంలో మాత్రం ఇంతవరకు స్పష్టత రాలేదు. మరోవైపు, ప్రియాంకా గాంధీ రాహుల్ నివాసానికి చేరుకున్నట్టు సమాచారం.
 
సోమవారం దాదాపు పది గంటల పాటు విచారించి రాహుల్‌ వాంగ్మూలాన్ని రికార్డు చేసిన ఈడీ అధికారులు.. మంగళవారం కూడా హాజరు కావాలని సమన్లు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఉదయం తన నివాసం నుంచి తొలుత కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న రాహుల్‌.. అక్కడి నుంచి ఈడీ కార్యాలయానికి వెళ్లి విచారణకు హాజరయ్యారు.
 
రాహుల్‌ గాంధీపై ఈడీ విచారణను నిరసిస్తూ రెండో రోజు కూడా కాంగ్రెస్‌ శ్రేణులు ఢిల్లీలో నిరసనలు తెలిపాయి. జన్‌పథ్‌ వద్ద నిరసన తెలిపిన ఆ పార్టీ సీనియర్‌ నేతలు కేసీ వేణుగోపాల్‌, అధిర్‌ రంజన్‌ చౌధురి, గౌరవ్‌ గగొయ్‌, దీపేందర్‌ సింగ్‌ హుడా, రంజీత్‌ రంజన్‌, ఇమ్రాన్‌ ప్రతాప్‌ గ్రహి తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకొని బాదార్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు