ఢిల్లీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. నేషనల్ హెరాల్డ్ పత్రిక మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల ముందుకు వచ్చారు. ఈ కేసులో విచారణ నిమిత్తం తమ ఎదుట హాజరుకావాలంటూ రాహుల్‌తో పాటు ఆయన తల్లి సోనియా గాంధీకి ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ సమన్లు జారీ చేసిన సమయంలో రాహుల్ విదేశాల్లో ఉన్నారు. ఇపుడు స్వదేశానికి తిరిగివచ్చిన ఆయన సోమవారం ఈడీ కార్యాలయానికి వచ్చారు.
ఈ సందర్భంగా నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో జరిగిన ఆర్థిక అవకతవకల వ్యవహారంలో పలు ప్రశ్నలు సంధించనున్నారు. నిజానికి ఈ నెల 2వ తేదీన రాహుల్ ఈడీ అధికారుల ఎదుట హాజరుకావాల్సివుంది. కానీ, విదేశాల్లో ఉన్న కారణంగా హాజరుకాలేకపోయారు.
కాగా, ఇదే కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈ నెల 23వ తేదీన ఈడీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గేతో పాటు మరో సీనియర్ నేత పవన్ బన్సల్‌ను విచారించిన విషయం తెల్సిందే.