కేరళ రాష్ట్రంలో కలకలం రేపిన నిఫా వైరస్ - విద్యా సంస్థలకు సెలవు

శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (11:16 IST)
కేరళ రాష్ట్రంలో నిఫా వైరస్ కలకలం రేపింది. దీంతో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ సెలవులు శనివారం వరకు పొడగించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా విద్యా సంస్థలను మూసివేసిన విషయం తెల్సిందే. ఇప్పటికే ఈ వైరస్ సోకి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి ఈ వైరస్ నిర్ధారణ అయింది. ఈ వైరస్ వెలుగు చూసిన ఏడు గ్రామాలను కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. 
 
ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా కోళికోడ్ జిల్లాలోని అంగన్వాడీలు, మదర్సాలు, ట్యూషన్ సెంటర్లు, ప్రొఫెషనల్ కాలేజీలు సహా అన్ని విద్యాసంస్థలకు గత రెండు రోజులు సెలవులు ఇచ్చారు. అనవసర ప్రయాణాలు, సమావేశాలకు దూరంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోళికోడ్ కలెక్టర్ ప్రజలను కోరారు.
 
ఇదిలావుంటే, రాష్ట్రంలో పరిస్థితిని సమీక్షించడానికి కేంద్రం నుంచి ఒక బృందం కోళికోడ్ చేరుకుంది. ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులతో ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సమావేశమయ్యారని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ఈ సమావేశంలో ఆగస్టు 30న మరణించిన మొదటి వ్యక్తిని కాంటాక్ట్ అయిన హై-రిస్క్ కాంటాక్ట్ గ్రూప్‌లో ఉన్న వారందరి నమూనాలను తీసుకోవాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ప్రస్తుతం 14 మంది ఐసోలేషన్‌లో ఉన్నారని తెలిపారు. వారి నమూనాలను కూడా తీసుకొని పరిశోధనశాలకు పంపుతామన్నారు. వైరస్ సోకిన 9 ఏళ్ల బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు