బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.. ఎప్పటికైనా జంప్ జిలానీనే : కేంద్ర మంత్రి రాందాస్

సోమవారం, 31 జులై 2023 (08:54 IST)
"ఇండియా" పేరుతో ఏర్పాటైన ప్రతిపక్ష పార్టీల కూటమిలోని ప్రధాన పార్టీల్లో ఒకటి జనతాదళ్ (యు). ఈ పార్టీ అధినేతగా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్ర సీఎంగా ఉన్న ఆయన.. ఈ కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. అయితే, ఆ కూటమిలోని పలు పార్టీల నేతలు నితీశ్ కుమార్‌ నిజాయితీని సందేహిస్తున్నారు. ఇపుడు కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నితీశ్ కుమార్ ఎప్పటికైనా తిరిగి ఎన్డీయే గూటికి చేరుతారని మంత్రి అథవాలే జోస్యం చెప్పారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీని అధికారంలో నుంచి తప్పించాలనే ఒకే ఒక ఎజెండాతో ప్రతిపక్షాలు 'ఇండియా' కూటమిని ఏర్పాటు చేశాయని, ఆ కూటమి పేరు విషయంలో నితీశ్ కుమార్ అభ్యంతరాలు వ్యక్తం చేశారని చెప్పారు. అక్కడ ఆయనకు సముచిత స్థానం ఉండదని చెప్పారు. అసంతృప్తితో ఉన్న నితీష్ ముంబైలో జరగబోయ ఇండియా కూటమి సమావేశానికి వెళ్లకూడదని, గతంలో ఎన్డీయే కూటమిలో ఉన్నందువల్ల ఆయన ఏ సమయంలో అయినా ఏన్డీయేలో చేరవచ్చని మంత్రి అథవాలే జోస్యం చెప్పారు. 
 
కేంద్ర మంత్రి వ్యాఖ్యలను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి రఘుబర్స్ సైతం బలపరిచారు. 'నితీశ్ మొదటి నుంచి ఎన్డీయే భాగస్వామిగా ఉన్నారు. ఆయన అథవాలేతో మాట్లాడి ఉండవచ్చు' అని ఆయన మీడియా ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అయితే, ఎన్డీయేలోకి వస్తా అని తానే చెప్పినా నితీశ్ కుమార్‌కు ఆ అవకాశం లేదని, బీజేపీ ఆయనకు అన్ని తలుపులనూ మూసేసిందని రాజ్యసభ ఎంపీ, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోడీ చెప్పుకొచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు