పురిటి నొప్పులు.. ఆటో రిక్షాలో ఆస్పత్రికి.. మార్గమధ్యంలోనే ప్రసవం.. గొయ్యిలో పడి శిశువు?

గురువారం, 1 సెప్టెంబరు 2016 (09:40 IST)
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యుల నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయే నిరుపేదల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. ఇటీవల ఒడిశాలో జరిగిన ఘటనలు కంటతడిపెట్టిస్తే.. తాజాగా ఓ నిండు గర్భిణీకి వైద్య సేవలు అందకపోవడంతో శిశువు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వివరాల్లోకి వెళితే.. జమునా భాత్రా అనే నిండు గర్భిణీకి పురిటి నొప్పులు రావడంతోఆమె కుటుంబ సభ్యులు జననీ ఎక్స్‌ప్రెస్ పేరిట ప్రభుత్వం నడుపుతున్న అంబులెన్సుకు ఫోన్ చేశారు. 
 
కానీ ఆంబులెన్స్ అందకపోవడంతో పురిటి నొప్పులతో అల్లాడిపోతున్న ఆ మహిళ ఆటో రిక్షాలో గ్రామం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి చేరుకోవాలనుకుంది. కానీ రోడ్డు మార్గం మొత్తం గోతులతో ఉండటంతో మార్గమధ్యంలో జమున ఆడ శిశువుకు జన్మనిచ్చింది. దాదాపు ఐదు గంటల పాటు పురిటి నొప్పులతో అల్లాడిపోయిన ఆ మహిళ, తనకు కాన్పుకాగానే నిస్సత్తువకు లోనైంది. 
 
ఈ నేపథ్యంలో తన నవజాత శిశువును చేతులతో భద్రంగా పట్టుకునే సత్తువ కూడా ఆమెకు లేకపోయింది. ఇంతలో ఆటోకు ఎదురుగా అకస్మాత్తుగా ఒక పెద్ద గొయ్యి రావడంతో ఆటో కుదుపులకు లోనై ఆడశిశువు ఆమె చేతుల నుండి జారిపడి మృతి చెందింది. ఈ ఘటన స్థానికులకు కలచివేసింది.

వెబ్దునియా పై చదవండి