వివాదాలంటే తెగ ఇష్టపడే బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ మరోసారి తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. కీలకమైన యూపీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. రామ మందిర నిర్మాణంపై సాక్షి మహారాజ్ మాట్లాడుతూ.. రామ మందిర నిర్మాణాన్ని ప్రపంచంలో ఏ శక్తీ అడ్డుకోలేదంటూ పేర్కొన్నారు. నిర్మాణానికి సంబంధించి కొన్ని సాంకేతిక అంశాలు అడ్డున్నాయని.. అవి అతి త్వరలో పరిష్కారమవుతాయని మహారాజ్ వెల్లడించారు.
ప్రజలు రామమందిర నిర్మాణం గురించి ఆందోళన చెందక్కర్లేదని.. ముస్లిం మద్దతు కూడా లభిస్తుందని.. ఇప్పటికే దాదాపు 60లక్షల మంది ముస్లింలు తమకు మద్దతిస్తూ ప్రతిజ్ఞ చేశారన్నారు. మా ప్రణాళికలకు అభ్యంతరాలుండవని భావిస్తున్నట్లు మహారాజ్ వ్యాఖ్యానించారు. అయోధ్యలో ఈ నిర్మాణం మోడీ పాలనలోనే జరుగుతున్నదని స్పష్టం చేశారు. యూపీ సీఎం అభ్యర్థిపై సాక్షి మహారాజ్ మాట్లాడుతూ... బీజేపీ అంటే ఎస్పీ, బీఎస్పీలా కాదని, అది ప్రజాస్వామ్యయుతమైనదని చెప్పారు.