గురుదాస్‌పూర్‌లో జరిగిన ఒక గ్రాండ్ వివాహం ఒక పీడకలగా మారింది. వధువు కుటుంబం గంటల తరబడి వేచి చూసినా వరుడు రాలేదు. ఎన్‌ఆర్‌ఐ వరుడు, అతని కుటుంబం ఎటువంటి జాడ లేకుండా అదృశ్యమయ్యారు. ఈ కేసుకు సంబంధించిన షాకింగ్ వివరాలు వెలుగులోకి వచ్చాయి. అది పెళ్లి రోజుకు ఎలా చేరుకుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన నిశ్చితార్థంలో ఒక మహిళ లోపలికి వచ్చి వరుడిని చెంపదెబ్బ కొట్టి, 2021లో తాను అతన్ని వివాహం చేసుకున్నానని చెప్పుకుంది. అయితే, వరుడి కుటుంబం ఈ సంఘటనను పెద్దది చేయకుండా, వధువు కుటుంబానికి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది.
ఎన్నారై వరుడు ఇచ్చిన వాగ్ధానాన్ని నమ్మి, ఆ కుటుంబం వివాహ సన్నాహాలు కొనసాగించింది. ఇది తరువాత వారికి మరింత ఇబ్బంది కలిగించింది. ఫిబ్రవరి 19న, వధువు కుటుంబం గురుదాస్‌పూర్‌లోని ఒక గొప్ప వేదిక వద్ద వేడుకలకు సిద్ధంగా సమావేశమైంది.
కానీ వరుడి కుటుంబం జాడలేదు. వరుడికి కాల్స్ చేసినా సమాధానం రాలేదు. పెళ్లికి రూ.20 లక్షలు ఖర్చు చేశామని, కానీ అవమానానికి, మోసానికి గురయ్యామని వధువు తండ్రి ధరంపాల్ ఆరోపించారు. ఈ సంఘటన జరిగిన వెంటనే ఆ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పంకజ్ కుమార్, అతని తండ్రి సత్పాల్, తల్లి కుసుమ్ లత, సోదరుడు అంకుష్ కుమార్ లపై మోసం, ఇతర అభియోగాల కింద కేసు నమోదు చేసినట్లు గురుదాస్‌పూర్ ఎస్‌ఎస్‌పి వెల్లడించారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతుండగా, వరుడు పరారీలో ఉన్నాడు.