తల్లికి అంత్యక్రియలు నిర్వహించేందుకు చిల్లిగవ్వ లేదు.. ఇంటిపైకప్పు పీకి దహనం చేశారు!

మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (13:42 IST)
ఇటీవలికాలంలో ఒడిషా రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలు చూస్తుంటే సమాజంలో మానవత్వం మంటగలిసిపోతుందనే అనుమానం కలగుతుంది. ఎందుకంటే మొన్నటికిమొన్న భార్య మృతదేహాన్ని 10 కిలోమీటర్ల మేరకు మోసుకెళ్లాడు. 
 
ఆ తర్వాత మార్చురీ వ్యాన్ ఇచ్చేందుకు నిరాకరించడంతో తల్లి శవాన్ని ఓ గిరిజన మహిళ రిక్షాలో తీసుకెళ్లింది. ఈ ఘటనలు మరువక ముందే ఒడిషా రాష్ట్రంలో మరోమారు ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ దీనావస్థను చూస్తే ఎవరికైనా హృదయం ద్రవించక మానదు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
కలహండి జిల్లా దోక్రిపడ గ్రామంలో కనక్ సత్పతి (75) అనే వృద్ధురాలు అనారోగ్యంతో కన్నుమూసింది. ఆమెకు నలుగురు కుమార్తెలు. కుమారులు లేరు. అయితే, ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు వారి వద్ద నయాపైసా లేదు. 
 
దీంతో చుట్టుపక్కల వారిని సాయం చేయమని వేడుకున్నా వారు. కానీ వారు ఏమాత్రం కనికరం చూపలేదు. దీంతో ఆ నలుగురు కుమార్తెలు తల్లి శవాన్ని భుజాలపై మోస్తూ శ్మశానికి తీసుకెళ్లారు. అయితే, దహన సంస్కారాలు చేసేందుకు కావాల్సిన కట్టెలను కొనేందుకు డబ్బులు లేకపోవడంతో ఇంటి పైకప్పును తొలగించి అంత్యక్రియలు పూర్తి చేశారు.

వెబ్దునియా పై చదవండి