మణిపూర్‌లో మరోసారి అధికార పగ్గాలు చేపట్టేందుకు కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది. ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబి సింగ్ కాంగ్రెస్ శాసనసభా పక్షం నేతగా ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని, తగిన సంఖ్యా బలం కూడగట్టిన అనంతరమే ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు వస్తామని ఆ పార్టీ ప్రతినిధి దేబబ్రత తెలిపారు. మరోవైపు భారతీయ జనతా పార్టీ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. ఏడు సీట్లు గెలుచుకున్న ఇతరులతో ఆ పార్టీ నేతలు ముమ్మరంగా చర్చలు జరుపుతున్నారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటులో తాము కూడా ముందున్నామని తేల్చి చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ రంగంలోకి దిగారు. బీజేపీయేతర ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నామని, ఎలాంటి బేరసారాలకు తావులేదన్నారు. బీజేపీ సైతం ప్రభుత్వం ఏర్పాటుకు పావులు కదుపుతున్న విషయాన్ని ప్రస్తావించినప్పుడు, ఎమ్మెల్యేలను ఢిల్లీ తీసుకువెళ్లేందుకు ఒక విమానాన్ని కూడా బీజేపీ అద్దెకు తీసుకుందని తెలుస్తోందని, భూములు, ఎస్‌యూవీలు, కాంట్రాక్టులు ఇచ్చేందుకు వాగ్దానం చేస్తున్నారని, ఇది ప్రజాతీర్పును పరిహసించడమేనని ఆయన ఆరోపించారు.
కాగా, 60 సీట్లు ఉన్న మణిపూర్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ 28 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్‌ను గవర్నర్ ఆహ్వానించాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్‌కు మరో ముగ్గురు అభ్యర్థుల మద్దతు అవసరం. ఇక...బీజేపీ 21 సీట్లు గెలుచుకుని రెండో స్థానంలో నిలబడటంతో ప్రభుత్వం ఏర్పాటుకు క్లెయిమ్ చేసుకోవాలంటే 10 మంది అభ్యర్థుల మద్దతు కూడగట్టాల్సి ఉంటుంది. ఇందుకోసం ఇతరులతో సంప్రదింపులు జరుపుతోంది.