రాజ్యాంగమే మనకు ఆశారేఖ: ప్రధాని నరేంద్ర మోడీ

గురువారం, 26 నవంబరు 2015 (12:51 IST)
రాజ్యాంగమే మనకు ఆశారేఖ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గురువారం ఉదయం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.... రాజ్యాంగంలోని 'హోప్‌' అనే పదానికి మోడీ సరికొత్త నిర్వచనం ఇచ్చారు. 'హోప్‌' పదంలో 'హెచ్‌ అంటే సామరస్యాం, ఒ-అవకాశం, పి-ప్రజల భాగస్వామ్యం, ఇ- సమానత్వం' అని వివరించారు. 
 
చర్చలు, సంప్రదింపులే పార్లమెంట్‌కు ఆత్మ అని వ్యాఖ్యానించారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ఎంపీలు వ్యవహరిస్తానే విశ్వాసం ఉందన్నారు. బుధవారం జరిగిన అఖిలపక్ష సమావేశం సామరస్య పూర్వకంగా జరిగిందని, పార్లమెంట్‌ సజావుగా సాగాలని అంతా ముక్తకంఠంతో చెప్పారని మోడీ చెప్పారు.

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ఎంతో ముందుచూపుతో అద్భుత రాజ్యాంగాన్ని భారత ప్రజలకు అందించారని కొనియాడారు. ఏ సమస్యనైనా, ఓపికతో చర్చించి పరిష్కరించుకునే అవకాశం మనకుందని, పార్లమెంటు చర్చావేదికగా మారాలే తప్ప కొత్త సమస్యలను సృష్టించరాదని హితవు పలికారు. ప్రజలు ఎన్నో ఆశలతో తమ ప్రతినిధులను ఎన్నుకుని పార్లమెంటుకు పంపితే, అనవసర రభసలతో విలువైన సమయాన్ని వృథా చేయవద్దని విపక్షాలకు మోడీ విజ్ఞప్తి చేశారు. 
 
ఇక రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తొలి రెండు రోజులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గౌరవార్థం ప్రత్యేక సమావేశాలు, తీర్మానంపై చర్చ జరగనుంది. ఈ రెండు రోజులు ప్రశ్నోత్తరాలు, జీరో అవర్, ఇతర కార్యక్రమాలు నిర్వహించరు. 

వెబ్దునియా పై చదవండి