నన్నే కాదు.. నా ఫ్రెండ్స్‌ను కూడా వదిలిపెట్టాలి.. లేదా నన్ను కూడా కాల్చేయండి.. బంగ్లా కుర్రోడి సాహసం!

మంగళవారం, 5 జులై 2016 (09:02 IST)
స్నేహం మతాన్ని కూడా మైమరిపిస్తుందని రుజువు చేశాడు ఓ యువకుడు. ఇటీవల బంగ్లాదేశ్‌లో జరిగిన మారణహోమంలో ఉగ్రవాదులు వెళ్లిపొమ్మని చెప్పినా కూడా తనతో పాటు వచ్చిన స్నేహితురాళ్ల కోసం అక్కడే ఉండి ప్రాణాలు కోల్పోయాడు ఫరాజ్ అయాజ్ హుసేన్ అనే బాలుడు. ఫరాజ్‌ స్నేహితురాళ్లలో భారతీయ యువతి తరుషి కూడా ఉంది. వివరాలను పరిశీలిస్తే...
 
ఫరాజ్‌ అమెరికాలోని ఎమ్రోయ్‌ యూనివర్సిటీలో చదువుతున్నాడు. వేసవి సెలవుల కారణంగా అతడు బంగ్లాదేశ్‌ వచ్చాడు. సెలవులకు వచ్చిన తన స్నేహితురాళ్లు ఎమ్రోయ్‌ యూనివర్సిటీలో చదువుతున్న అమెరికాకు చెందిన అబింతా కబిర్‌, కాలిఫోర్నియా యూనివర్సిటీలో చదువుతున్న భారతీయ విద్యార్థిని తరుషి జైన్‌తో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లారు. అయితే వారు వెళ్ళిన కొద్ది సేపటికి ఉగ్రవాదులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. చాలా మందిని బందీలుగా చేసుకొని నానా హింసలు పెట్టారు. 
 
ఉగ్రవాదులు బంగ్లాదేశ్‌ వారిని వదిలేసి.. విదేశీయులను మాత్రమే హతమార్చారు. అయితే ఫరాజ్‌తో ఆ ఉగ్రవాదులు నువ్వు ముస్లిం అందులోనూ బంగ్లాదేశ్‌కు చెందిన వాడివి కాబట్టి... నిన్ను మేము వదిలి పెడుతున్నాం వెళ్లిపో అన్నారట. అందుకు ఫరాజ్ నా ఫ్రెండ్స్ పరిస్థితి ఏంటి అని అడగడంతో వారు విదేశీయులు వాళ్ళను విడుదల చేయడం కుదరదు అని చెప్పారట. తన స్నేహితురాళ్లను వదిలేస్తే వెళ్తానని.. లేదంటే వెళ్లనని చెప్పడంతో ఉగ్రవాదులు అతడిని కూడా చంపేశారు. 
 
ఆ తర్వాత ఆ రాక్షసులు సృష్టించిన మారణహోమంలో ఫరాజ్‌తో పాటు అతడి స్నేహితులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉదంతాన్ని అక్కడ నుంచి బయటకు వచ్చిన కొందరు బంగ్లాదేశీయులు చెప్పారు. ఫరాజ్ గొప్పతనం, అతని తెగింపు గురించి తెలిసి చాలా మంది కన్నీరు మున్నీరు అయ్యారు. దీంతో ఫరాజ్ సోషల్ మీడియాలో హీరో అయ్యాడు. 

వెబ్దునియా పై చదవండి