ముంబై తరహా ఉగ్రదాడికి ప్లాన్.. పాక్ నుంచి 20 మంది ముష్కరులు.. నిఘా వర్గాల హెచ్చరిక

బుధవారం, 31 మే 2017 (08:43 IST)
దేశవాణిజ్య రాజధాని ముంబైలో మరోమారు మారణహోమం సృష్టించేందుకు పాకిస్థాన్ ప్లాన్ వేసినట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఇందుకోసం పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాదాపు 20 నుంచి 25 మంది వరకు భారత్‌లోకి చొచ్చుకువచ్చారని కేంద్రం ఇంటెలిజెన్స్ వర్గాలు స్పష్టం చేశాయి. 
 
ఈ ముష్కర మూకలు పాకిస్థాన్‌ సరిహద్దుల్లోని పట్టణాల్లోగానీ, దేశంలోని ఏదైనా మెట్రో నగరంలోగానీ దాడి చేసే అవకాశం ఉందని తెలిపాయి. పర్యాటక ప్రాంతాలు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, మాల్స్‌, హోటళ్లను లక్ష్యంగా చేసుకుంటారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లకు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీచేసింది. 
 
కాగా, గత 2008 సంవత్సరం నవంబరు 26వ తేదీన పది పాక్ ముష్కరులు ముంబైలోకి ప్రవేశించి మారణహోమం సృష్టించిన విషయం తెల్సిందే. ఈ దాడిలో సమారు 165 మంది ముంబై వాసులతో పాటు 9 మంది ముష్కరులు హతమయ్యారు. ముంబైలోని పలు ప్రాంతాల్లో వీరు దాడులకు పాల్పడ్డారు. ప్రాణాలతో పట్టుబడిన మరో ఉగ్రవాది కసబ్‌ను ఉరితీయడం జరిగింది. ఈ దాడులకు జహీర్ రెహ్మాన్ లఖ్వీ ప్రధాన సూత్రధారి.

వెబ్దునియా పై చదవండి